ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయని తాజాగా తెలిసింది. అయితే.. వాస్తవ లెక్క ప్రకారం.. అంటే.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం ప్రకారం.. 50 అదనపు నియోజకవర్గాలు రావాల్సి వుంటుంది. కానీ, దీనికి భిన్నంగా.. 263 స్థానాలు పెరగనున్నాయి. అంటే.. ప్రస్తుతం ఉన్న 175 స్థానాలకు అదనంగా.. 88 స్థానాలు పెరగనున్నాయి. అయితే.. నిన్న మొన్నటి వరకు ఉన్న లెక్కల ప్రకారం.. 50 స్థానాలు పెరిగితే.. పురుష నాయకులు ఒకింత తప్పుకొనే పరిస్థితి ఏర్పడేది.
కానీ.. ఇప్పుడు మరింత పెరిగినా.. నష్టం రాకుండా.. మహిళా నాయకులను ప్రోత్సహించనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. పెరగనున్న 88 స్థానాల్లో 81 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. ఇది ఆశాజనకమే అయినప్పటికీ.. ఈ సంఖ్యలో మహిళలను ఏర్చి కూర్చడం.. పార్టీలకు తలకు మించిన భారంగా మారుతుంది. వైసీపీ అయినా.. టీడీపీ అయినా.. నాయకులు ఉన్నారన్న సందేహం లేదు. కానీ.. వారిలో ఎంత మంది గెలుపు గుర్రాలు అనేది ప్రశ్న.
ఒక సీటును ఇచ్చేయడం అంటే.. గెలుపు గుర్రం ఎక్కడంతోపాటు.. సామాజిక, ఆర్థిక అంశాలను కూడా పార్టీలు పరిగణనలోకి తీసుకుంటాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయి. కానీ.. ఇప్పుడు పెరుగుతున్న 88 స్థానాల్లో 81 మహిళలకు ఇవ్వడం వల్ల.. మిగిలిన 176 స్థానాలను ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. అదేసమయంలో రిజర్వ్డ్ స్థానాలు కూడా పెరగనున్నాయి. ఎలా చూసుకున్నా.. సెగ్మెంట్లు పెరగనున్నాయి. కానీ.. నాయకులు ఏమేరకు పెరుగుతారన్నది ప్రశ్న.
ఇప్పటి నుంచే..
ఈ నేపథ్యంలో పార్టీలు ఏవైనా కూడా.. ఇప్పటి నుంచే పెరగనున్న సీట్లకు అనుగుణంగా.. పార్టీలు నాయకులను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఎంత మంది రాజకీయాల్లోకి వస్తారు? ఎంత మంది ఆర్థికంగా ప్రస్తుతం ఉన్న రాజకీయాలను తట్టుకుని నిలబడతారు? అనేది కూడా ముఖ్యమే.
అదేసమయంలో సామాజిక వర్గాలు.. ఈక్వేషన్లు.. ప్రజల అభిమానాన్ని చూరగొనడం ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం .. నాయకుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.