టాలీవుడ్ లెజెండరీ కమెడియన్లలో ఒకరైన బాబు మోహన్.. సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబును ఉద్దేశించి ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రామానాయుడు తనకు దైవ సమానులు అంటూనే.. సురేష్ బాబు ఆయన కంటే పెద్దవారు అని వ్యంగ్యంగా మాట్లాడిన బాబు మోహన్.. తనకు ఈ కార్యక్రమంలో తగిన గౌరవం దక్కలేదని.. సభా మర్యాద పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇకపై తనను ఇక్కడికి పిలవకండి అంటూ ఆయన తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన రామానాయుడు స్టూడియోలోనే జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో చింతామణి నాటక ప్రదర్శన జరిగింది. ఐతే స్టేజ్ మీదికి బాబు మోహన్‌ను ఆహ్వానించకపోవడం, తగిన గౌరవాన్ని ఇవ్వకపోవడంతో బాబు మోహన్‌కు కోపం తెప్పించింది.
దీంతో తాను మాట్లాడే అవకాశం వచ్చినపుడు బాబు మోహన్ తన కోపాన్నంతా బయటపెట్టేశారు. రామానాయుడు స్టూడియో అధినేత అయిన సురేష్ బాబు మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘‘ఇక్కడ పెత్తనం అంతా సురేష్ బాబుదే కదా. నన్ను ఇక్కడికి ఇంకెప్పుడూ పిలవకండి. నా కెరీర్లో ఇప్పటి వరకు 2012 సినిమాల్లో నటించాను. ఇప్పటికీ నటిస్తున్నాను. నాకు రామానాయుడు గారు దైవ సమానులు. ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆయన కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చాను. ఇకపై నన్ను ఇక్కడికి పిలవకండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పెత్తనం సురేష్ బాబు గారిది.
రామానాయుడు గారి కంటే సురేష్ బాబు గారు పెద్ద వారు కదా. కాబట్టి ఈ స్టేజీపై నిలబడడానికి నేను అనర్హుడిని. కనీసం సభా మర్యాద పాటించలేదు. నేను మాజీ మంత్రిని. పెద్ద స్టార్‌ని. ఆయన చేస్తే నేను స్టార్ కాలేదు’’ అంటూ బాబు మోహన్ మండిపడ్డారు.
సురేష్ బాబుతో బాబు మోహన్‌కు పాత గొడవలేమీ ఉన్నట్లుగా ఎప్పుడూ వార్తలు రాలేదు. కానీ ఈ కార్యక్రమంలో తనకు తగిన గౌరవం దక్కకపోవడానికి సురేష్ బాబే కారణమని భావించి ఆయన మీద బాబు మోహన్ తన అసహనాన్ని చూపించినట్లుగా భావిస్తున్నారు.