అమరావతి : అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆర్డీటీ విదేశీ నిధుల రెన్యూవల్ కు సహకరించిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి, బంగారు శ్రావణితో కలిసి ఆమె మాట్లాడారు. 60 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆపద్బాంధవిలా నిలుస్తూ, సామాజిక సేవలు అందిస్తోందన్నారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు అనంతపురంలోని వెనుకబడిన ప్రాంతాలను చూసి చలించి పోయారన్నారు.
ఆర్డీటీ సంస్థను స్జాపించి పేదలకు విద్య, వైద్య సేవలు అందించారన్నారు ఎస్. సవిత. ఇళ్లు లేని వేలాది మందికి గృహ సదుపాయం కల్పించారని, మరికొందరు పేదలకు వ్యవసాయం కోసం భూములిచ్చారని, ఆధునిక పనిముట్లు అందిస్తూ రైతులకు తోడుగా నిలిచారని కొనియాడారు. ముఖ్యంగా, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందజేశారని, ఎందరో అనంతపురం క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సందర్భాలు ఉన్నాయన్నారు మంత్రి. ఆర్డీటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో ఎందరో పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అత్యవసర చికిత్స కోసం బెంగళూరుకో, హైదరాబాద్‌కో వెళ్లాల్సిన అవసరం తప్పిందన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ఈ ఆసుపత్రి ఓ వరమన్నారు. వేలాది మంది పేద బిడ్డలను చదివించి ఆ సంస్థ ప్రయోజకులను చేసిందని మంత్రి కొనియాడారు.
The post ‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం
Categories: