హైదరాబాద్ : తెలంగాణ పాలిట భారతీయ జనతా పార్టీ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఏడు మండలాలు, లోయర్ సీలేరును ఆంధ్రాలో కలిపి రాష్ట్ర గొంతు కోసింది బీజేపీనేనని మండిపడ్డారు. కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందని కేంద్రమే సర్వేలో చెబితే కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గడ్కరీ కాళేశ్వరాన్ని మెచ్చుకుంటే కేంద్రమంత్రి అవేవీ పట్టించుకోకుండా తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో పచ్చి అబద్ధాలు ఆడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కందుకూరు మండలం సార్లరావులపల్లిలో శ్రీ స్వయంభు పెద్దమ్మతల్లి జాతర, రాజశ్యామల హోమం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న వారికి ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
మహేశ్వరం మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ ఇక్కడ మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. ఈ కాలేజీ తో పాటు 250 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సుమారు రూ. 150 కోట్లు మంజూరు చేయడంతో పాటు, స్థలాన్ని కేటాయించి జీవో కూడా ఇచ్చామని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూరితంగా మహేశ్వరం మెడికల్ కాలేజీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని వాపోయారు.
ఎల్బీనగర్ లో కేసీఆర్ మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీని పెట్టి, అక్కడి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందకుండా, ఇక్కడ మహేశ్వరం ప్రజలకు మెడికల్ కాలేజీ లేకుండా చేసిందన్నారు.
The post తెలంగాణ గొంతు కోసింది బీజేపీనే : హరీశ్ రావు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తెలంగాణ గొంతు కోసింది బీజేపీనే : హరీశ్ రావు
Categories: