హైదరాబాద్ : ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 01లోని తాజ్ బంజారా లేక్‌ను పరిశీలించారు. అనంతరం శంషాబాద్ మండలం మామిడిపల్లిలోని చెరువులు, వరద కాలువల ఆక్రమణలపై ఆరా తీశారు . తాజ్ బంజారా హోటల్ ముందున్న బంజారా లేక్ ఆక్రమణలకు గురవ్వడమే కాకుండా.. పూర్తిగా కలుషితమై దుర్గంధ భరితంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఆయనతో పాటు పరిసర ప్రాంత నివాసితుల ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షంచారు. కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేరడం.. పై నుంచి కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్‌తో చెరువు సగానికి పైగా నిండి ఉండడాన్ని కమిషనర్ గమనించారు.
ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న బంజారాలేక్ ఇలా దుర్గంధ భరితంగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెరువు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అత్యంత కలుషితమైన జలవనరుగా మారిపోవడం పట్ల మండిపడ్డారు. ఎప్‌టీఎల్ పరిధిలోనే రహదారి నిర్మించడం, వ్యర్థాలను పారబోయడంతో చెరువు ఉనికికి ప్రమాదం ఏర్పడినట్టయ్యిందని పేర్కొన్నారు. కట్ట మైసమ్మ దేవాలయానికి వెళ్లే దారిని కూడా ఆక్రమణదారులు మూసి వేయడంపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు.
బంజారాలేక్ పై భాగంలో ప్రభుత్వ భూమి కూడా ఉందని, ఆ భూమిని కాపాడడంతో పాటు చెరువు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. నివాసాల జోలికి వెళ్లకుండాచెరువును పరిరక్షిస్తామని చెప్పారు. నాలాలను మూసివేసి వరద ముప్పునకు కారణమయ్యే నిర్మాణాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో పాటు ఆక్రమణలకు పాల్పడిన వారిని కూడా పిలిచి పారదర్శకంగా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
The post మాయమైన చెరువుల జాడపై హైడ్రా కమిషనర్ ఆరా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మాయమైన చెరువుల జాడపై హైడ్రా కమిషనర్ ఆరా
Categories: