వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక నేతలు నేడు మౌనంగా ఉండిపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీగా భావించబడిన ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ కార్యక్రమాల పట్ల చురుకుదనం చూపకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇది వ్యూహాత్మక నిశ్శబ్దమా..? లేక కేసుల భయమా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కూటమి నేతలు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అవకాశాలు దాదాపు లేవని గట్టిగా చెబుతుండగా, కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఒకవేళ 2029లో తిరిగి అధికారం వస్తే ప్రస్తుతం మౌనంగా ఉన్న నేతలే మళ్లీ జగన్ చుట్టూ చేరే అవకాశముందని చర్చ సాగుతోంది.
అప్పుడు ప్రస్తుతం ముందుండి పోరాడుతున్న ఇతర సామాజిక వర్గాల నేతల పరిస్థితి ఎలా ఉంటుందన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. ఓటమి అనంతరం దాదాపు ఏడాదిన్నర గడిచిన తర్వాత జగన్ పరామర్శల పేరిట క్రమంగా ప్రజల్లోకి రావడం ప్రారంభించారు. రెండేళ్ల ముందు పాదయాత్ర చేపడతానని ప్రకటిస్తూ పార్టీకి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు క్యాడర్‌లో నిరుత్సాహం రాకుండా ఉండేందుకు మాజీ మంత్రులు, ముఖ్య నేతలకు టార్గెట్లు కేటాయిస్తున్నా… వాటి అమలు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, మీడియా సమావేశాల్లో కొందరు నేతలే తరచూ కనిపిస్తుండగా, జగన్‌కు సన్నిహితంగా భావించిన నేతలు మాత్రం పరిమితంగా కనిపించడం గమనార్హం. పార్టీకి కుడిభుజంగా భావించిన విజయసాయి రెడ్డి ఇప్పటికే పార్టీకి దూరమవడం కీలక పరిణామం. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి కేసుల్లో చిక్కుకోవడం ప్రభావం చూపుతోంది.
మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పార్టీని వీడి వెళ్లడం కూడా పార్టీకి దెబ్బగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి అంతర్గత వ్యవహారాలకే పరిమితమవుతుండగా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా వంటి నేతలు అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు.
ఇక మరోవైపు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాల్లో ముందంజలో కనిపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా చురుకుగా వ్యవహరిస్తుండగా, అంబటి రాంబాబు, పేర్ని నాని పార్టీ స్వరంగా నిలుస్తున్నారు. జోగి రమేష్ కూడా బెయిల్‌పై విడుదలైన తర్వాత తన స్వరాన్ని మరింత పెంచారు. పార్టీ కార్యక్రమాలు, మీడియా సమావేశాల్లో వీరే ముందుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే… వైసీపీలో సామాజిక సమీకరణాలు కొత్త దిశగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కష్టకాలంలో బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నేతలు ముందుకు వచ్చి పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అదే సమయంలో జగన్‌కు సమీపంగా ఉన్న నేతలు వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదే నేతలు ఒక వేళ జగన్రాజకీయంగా పుంజుకుంటే మళ్లీ ఆయన పక్కకు చేరతారని, కోటరీ కడతారనే వాదనలు వినిపిస్తున్నారు.
గతంలో జగన్ అధికారంలోకి రాగానే తన సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమైన మంత్రి పదవులను అప్పగించారు. జగన్ హయాంలో దాదాపు 24 మంది ప్రభుత్వ సలహాదారులలో 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఉండటం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే నేతలు మౌనంగా ఉండడానికి కారణం ఏమిటనే చర్చ సాగుతోంది.