దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండు అంశాలను తేల్చేందుకు.. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా భేటీ అవుతున్నాయి. వీటిని తేల్చడంలో ఇప్పటికే ఆలస్యమైందని.. ప్రధాన మంత్రి మోడీ ఇటీవల కూడా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనిని తేల్చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ రెండు విషయాలపై ఏం చేయాలన్న అంశం కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టింది. తాజాగా నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ పార్టీ అగ్రనేతలు చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజనను గుడ్డిగా సమర్థించడానికి వీల్లేదని తీర్మానించారు.
జనాభా ఆధారంగా జరగాల్సిన నియోజకవర్గాల పెంపు వ్యవహారాన్ని జనాభాతో సంబంధం లేకుండా.. కేవలం బీజేపీ తన రాజకీయ కోణంలోనే చూస్తోందని.. తద్వారా ఉత్తరాదిలో బీజేపీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో జమిలి ఎన్నికల పైనా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దాదాపు 40 ఏళ్లుగా విడివిడిగా జరుగుతున్న ఎన్నికలను ఇప్పుడు జమిలి ఎన్నికలుగా మార్చడం వెనుక బీజీపీ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని నాయకులు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు సహా.. నియోజకవర్గాలపునర్విజన అంశంపై ఇరు సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరిగేలా చూడాలని.. ప్రజల ప్రయోజనం, రాష్ట్రాల ప్రయోజనం వంటి కీలక అంశాలపై చర్చించాలని భావించారు. కానీ.. ఇప్పుడు ఉభయ సభల్లోనూ బీజేపీ అనుకూల పార్టీలసంఖ్య పెరగడం.. ఉభయ సభల్లోనూ బీజేపీకి మద్దతు కూడా పెరిగిన దరిమిలా..ఈ రెండు అంశాలకు పార్లమెంటు ఆమోదం తెలపడం.. లాంఛనమే అవుతుందన్న వాదన ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన అనుకూల పార్టీలతో చర్చలు జరపాలని నిర్ణయించింది.