పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్ మార‌డం అన్న‌ది మామూలైపోయింది. ఐతే చిన్న సినిమాలు డేట్లు మార్చుకోవ‌డం వ‌ల్ల అటు వేరే చిత్రాల‌కు కానీ, ఇటు ప్రేక్ష‌కుల‌కు కానీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ భారీ అంచ‌నాలున్న పెద్ద సినిమాల‌కు డేట్లు మారితే అంద‌రికీ ఇబ్బందే. పెద్ద సినిమాల విడుద‌ల‌ను అనుస‌రించి.. త‌మ సినిమాల డేట్లు ఫిక్స్ చేసుకునే చిన్న సినిమాల‌కు త‌ల‌నొప్పి త‌ప్ప‌దు.

అలాగే ఆ పెద్ద సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్ష‌కులూ అస‌హ‌నానికి గుర‌వుతుంటారు. ఈ వేసవికి షెడ్యూల్ అయిన అత్యంత పెద్ద సినిమా పెద్ది రిలీజ్ డేట్ ఒక‌టికి రెండుసార్లు మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే మార్చి చివ‌రి వారం నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేశాక‌.. ఆ డేట్ విష‌యంలో విప‌రీత‌మైన సందిగ్ధ‌త న‌డిచిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ వాయిదా అని.. లేదు లేదు అని కొన్ని రోజుల పాటు అయోమ‌యం కొన‌సాగింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు జూన్ 4కి ఈ చిత్రాన్ని ఖాయం చేశారు.

ఐతే పెద్ది లాంటి పెద్ద‌ సినిమాల రిలీజ్ విష‌యంలో అయోమ‌యం చిన్న సినిమాల‌కు చాలా ఇబ్బందిక‌రం అంటూ ద‌ర్శ‌కుడు ర‌విబాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. పెద్ది వ‌ల్ల త‌న సినిమా రేజ‌ర్ విడుద‌ల విష‌యంలోనూ సందిగ్ధ‌త‌ను ఎదుర్కొన్న‌ట్లు ఆయ చెప్పారు.

త‌న సినిమాను మే 1నే రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నామ‌ని, అప్ప‌టికే సినిమా రెడీ అయ్యేద‌ని.. కానీ ఏదో పెద్ద (పెద్ది) సినిమా 30న వ‌స్తుంద‌ని కొన్ని రోజులు హ‌డావుడి చేశార‌ని.. తర్వాత వాయిదా అన్నార‌ని.. మ‌ళ్లీ అదే డేటుకు వ‌స్తుంద‌ని చెప్పార‌ని.. ఈ అయోమ‌యం అంతా చూసి ఎందుకులే గోల అని తాము మే 8కి వెళ్లిపోయిన‌ట్లు ర‌విబాబు వెల్ల‌డించాడు.

ఈ మ‌ధ్య పెద్ద సినిమాల విడుద‌ల తేదీల విష‌యంలో త‌ర‌చుగా ఈ గంద‌ర‌గోళం న‌డుస్తోంద‌ని.. ఇది చిన్న సినిమాల‌కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారుతోంద‌ని ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మే 8తో పాటు 15 కూడా ఆప్ష‌న్‌గా క‌నిపించిన‌ప్ప‌టికీ.. 8వ తేదీ త‌న తండ్రి చ‌ల‌ప‌తిరావు పుట్టిన రోజు కావ‌డంతో ఆ డేట్‌ను ఎంచుకున్న‌ట్లు ర‌విబాబు వెల్ల‌డించారు. ఆయ‌న జీవించి ఉంటే రేజ‌ర్ సినిమా చూసి గ‌ర్వించేవారో. లేదా తిట్టేవారో త‌న‌కు తెలియ‌ద‌న్న ర‌విబాబు.. త‌న కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చి రేజ‌ర్ సినిమా చూడాల‌ని కోరారు.

More From Author

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్.. ఎవరెవరికి ఎంత ఛాన్స్?

లెక్క తప్పిన సాయిపల్లవి జాగ్రత్తలు