“మీరెవరూ ఇంతకు ముందు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం. 2028 నాటికితొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాం. అద్భుతమైన నిర్మాణాలే కాదు.. ప్రపంచస్థాయి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక అద్భుత నగరంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు” అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి రాజధాని సహా.. రాష్ట్రంలో గత 15 మాసాల్లో చేపట్టిన అభివృద్ధిని వారికి వివరించారు.
సన్ రైజ్ ఏపీ!
సన్ రైజ్ ఏపీ నినాదంతో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టికి మార్గాలు పరిచామన్న ఆయన.. పీ-4 విధానంలో 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందని చెప్పారు. 2024-25 లో 8.25 వృద్ధిరేటు సాధించామన్న చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు గంటా 20 నిమిషాల సేపు ప్రసంగించారు.
బాబు ప్రసంగంలో కీలకాంశాలు!
- ఏపీ పారిశ్రామిక వేత్తలకు కల్పతరువు. పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాం.
- నవంబరు 14, 15 తేదీల్లో పెట్టుబడలు సదస్సుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం.
- రాష్ట్రాలను ప్రమోట్ చేసుకోవడానికి సీఐఐ కీలకమైన డయాస్‌గా మారింది.
- దీనిని ఏపీ సమర్థవంతంగా వినియోగించుకుంటుంది.
- దావోస్ వెళ్తున్న ముఖ్యమంత్రుల్లో నేనే ఫస్ట్.
- పెట్టుబడులు వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.
- శాంతి భద్రతలను అదుపులో పెట్టాం.. ప్రజలు సుపరిపాలకులకు పట్టం కట్టారు.
- ఏపీలో వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. మీరు ఏర్పాటు చేసే ప్రతి కంపెనీకీ రవాణా సౌకర్యం కల్పిస్తాం.
- ప్రతి 50 కిలో మీటర్లకు పోర్టు ఏర్పాటు చేస్తున్నాం. విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నాం.
- లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం.
- స్వర్ణాంధ్రప్రదేశ్ -2047 నినాదంతో ముందుకెళ్తున్నాం.
- 2047 నాటికి 2.47 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం.
- పీపీపీ విధానం ద్వారా ఆదాయం సృష్టించాం.
- అమరావతిలో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం.
- అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ను జనవరి నాటికి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాం.