ఏపీ అధికార పార్టీ.. టీడీపీ వ్యూహం ఏంటో తెలియక తెలంగాణలో ఎదురు చూస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు లబోదిబోమంటున్నారు. చాలా మంది పార్టీలు మారినా, కొందరు అత్యంత నమ్మకంతో, అన్నగారి హయాం నుంచి ఉన్న కుటుంబాలు కూడా పార్టీలో కొనసాగుతున్నాయి.
ఇక తెలంగాణలో పార్టీని విస్తరించాలని భావించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ అనూహ్యంగా మౌనం పాటిస్తోంది. దీంతో అసలు తెలంగాణలో పార్టీ విస్తరిస్తారా లేదా అనేది సందేహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొన్నాళ్ల కిందట మంత్రి నారా లోకేష్ తెలంగాణలో ఎన్టీఆర్ భవనానికి వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడారు.
అప్పట్లో ఆయన త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని, మనం బలోపేతం కావాలని సూచించారు. అంతేకాదు, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని దిగువ శ్రేణి నాయకులకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇది జరిగి కూడా దాదాపు నాలుగు నెలలు అయిపోయింది.
ఇప్పుడు తాజాగా తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం ఐదు దశల్లో నిర్వహించే ఎన్నికల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వచ్చేనెల 9న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో అసలు టిడిపి వ్యూహం ఏంటి? మరి తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందా? ఏ దిశగా అడుగులు వేస్తున్నారు? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం మౌనంగా వ్యవహరిస్తోంది. మరోవైపు తెలంగాణ టిడిపిని నడిపించే సారధి కూడా ఇప్పటివరకు ఎవరు లేకపోవడం విశేషం.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతుంది? అసలు పోటీ చేస్తుందా లేదా? అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీ చేయాలనే వెనక భావిస్తే ఇప్పటినుంచే పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ నాయకులు చెబుతున్నారు.
స్థానిక సంస్థల్లో పోటీ చేయడం ద్వారా ఓడుతామా గెలుస్తామా అనేది పక్కన పెడితే, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు ఇవే సరైన ఎన్నికలని చాలామంది నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యത്തിൽ పార్టీ అధిపతిగా సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకం.
కానీ ఇప్పటివరకు ఎలాంటి సందడి, చడి చప్పుడు అయితే కనిపించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ భవన్ కూడా ఖాళీగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి అసలు తెలంగాణలో పార్టీ ఉన్నట్టా లేనట్టా అనేది ఒక ప్రశ్న. అయితే మరోవైపు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పార్టీ పుంజుకుంటుందని కొందరు, లేదు మౌనంగా ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.