
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సునీతా గోపినాథ్‌ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా రేసులో నలుగురు నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ ఉండగా ఎవరికి టికెట్ దక్కుతుందోనని నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఇన్చార్జులుగా ఉన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్ వెంకటస్వామికి అభ్యర్థి ఎంపిక కాస్త ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో పొన్నం వర్సెస్ అంజన్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అయితే ఇప్పటికే నలుగురి పేర్లను మంత్రులు…పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకరి పేరును ఫైనల్ చేయనుంది.
సర్వేల ఆధారంగా అభ్యర్థిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది. నేడో, రేపో నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్‌లో ఒకరిని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు బాగా వినపడుతున్నాయి. వారిలో నవీన్ యాదవ్‌వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
యువ నాయకుడు కావడం, చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఆయనకు కలిసి వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం నుంచి ఆయన పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..నేతల్లో టెన్షన్! appeared first on Adya News Telugu.