అనేక సార్లు వేచి చూసి తొలిసారి అవకాశం దక్కించుకున్న వేగేశ్న నరేంద్ర వర్మ దూకుడు మామూలుగా లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో నారా లోకేష్ స్వయంగా “వర్మగారూ.. కొంచెం గ్యాప్ ఇవ్వండి సర్..!” అనే పరిస్థితి వచ్చిందట. మరి దీని వెనుక ఏం జరిగింది? ఆయన ఏం చేస్తున్నారు? అనేది వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉందని అంటున్నారు. టీడీపీ నాయకుడిగా అవతరించిన ఎన్నారై నాయకుడు వేగేశ్న నరేంద్ర వర్మ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి.
2014 నుంచి వేచి చూసి అనేక సార్లు టికెట్ రేసులో నిలిచిన వర్మకు 2024 వరకు పరిస్థితులు అనుకూలించలేదు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే ఇది కూటమి హవాలో కొట్టుకొచ్చిన బ్యాచ్ కాదనేది వాస్తవం. ఆయన వ్యక్తిగతంగానే ప్రజలకు చేరువయ్యారు. అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలతో బాపట్ల ప్రజల మనసు దోచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేగేశ్న ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు తాగునీరు నుంచి కరెంటు సదుపాయం వరకు అనేక రూపాల్లో సేవలు చేస్తున్నారు.
ఆది నుంచే ఆయన ప్రజల పక్షమే వహించారు. 2019లో తనకు ఎలాంటి పదవి లేకపోయినా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు. గ్రామాల్లో తిరిగారు. ఇక 2024లో ఇదే ఆయనకు కలిసివచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రజల కోసం, బాపట్ల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం వేగేశ్న నరేంద్ర వర్మ “మీ ఎమ్మెల్యే” పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే పలు ప్రాంతాల్లో సమస్యలపై ఆయన ఆర్థికంగా ప్రభుత్వానికి ఇండెంట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలో తనకు బాగా పరిచయం ఉన్న మంత్రి నారా లోకేష్ ద్వారా పనులు చేయించుకుంటున్నారు. నిధులు సమకూర్చుకుంటున్నారు. అయితే ఇప్పటికి అనేక రూపాల్లో నిధులు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం కొంత వెయిట్ చేయాలని వర్మగారికి సూచించింది. అయితే ఆయన నిత్యం నారా లోకేష్ పేషీకి ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారు. “నేను వస్తా..” అంటూ వర్తమానం పంపుతున్నారు. ప్రజలకు మేలు చేయడం పట్ల నారా లోకేష్ సంతోషంగానే ఉన్నా నిధుల విషయంలో కొంత వెయిట్ చేయాలని, ప్రజల మధ్యకు వెళ్లినా సంక్షేమ పథకాలకే పరిమితం కావాలని, కొంత గ్యాప్ తీసుకోవాలని సూచించారట. ఇదీ సంగతీ..!