బీహార్ లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.
బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.
ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బీజేపీకు మిత్రపక్షం వార్నింగ్
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ కూటముల్లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాజపా మిత్రపక్షం హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) 15 సీట్లు డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మాకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే.. గౌరవప్రదమైన సీట్లు కావాలి. మేం 15 సీట్లు డిమాండ్ చేస్తున్నాం. ఆ సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోం. కానీ ఎన్డీయేలోనే కొనసాగుతాం. నేనేమీ ముఖ్యమంత్రిని కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీకి గుర్తింపు కావాలని మాత్రమే ఆరాటపడుతున్నాం’’ అని జీతన్ రామ్ అన్నారు. దీనిపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
ఎన్డీయే కూటమిలో జేడీయూ, భాజపా (BJP-JDU), జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM), చిరాగ్ పాసవాన్ ఆధ్వర్యంలోని లోక్‌జనశక్తి పార్టీ (LJP), ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (RLM) భాగం. హెచ్‌ఏఎంకు ఏడు, ఆర్‌ఎల్‌ఎంకు ఆరు సీట్లు ఇచ్చేందుకు భాజపా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కూటమిలో కీలక పార్టీలైన జేడీయూ, భాజపా సమానంగా సీట్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చెరో 100 స్థానాల్లో పోటీ చేయొచ్చని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నవంబరు 6, 11 తేదీల్లో రెండు విడతలుగా బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబరు 22వ తేదీతో ముగియనుంది.
The post Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?
Categories: