hyderabadupdates.com Gallery Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్ post thumbnail image

 
 
నేను ఉప ముఖ్యమంత్రిగానో… ఎమ్మెల్యేగానో… ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా… వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి… ఇక్కడికి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల ద్వారా సముద్రంలో కలుస్తున్న కలుషిత జలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే కనీసం 100 రోజుల సమయం కావాలని, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే పరిష్కారాన్ని చూపించే బాధ్యతను తాను తీసుకుంటానని వెల్లడించారు. పిఠాపురం నియోజక వర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల కలుషిత జలాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలన్నారు. ఉప్పాడ మత్స్యకారులంతా దీనిపై చేతులు పైకి ఎత్తి అభిప్రాయం తెలియజేయాలని బహిరంగ సభలోనే రిఫెరండం కోరారు.
 
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి గ్రామంతోపాటు చుట్టు పక్కలనున్న గ్రామాల్లో కొన్ని ఫార్మా పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద దెబ్బ తింటోందని, వేట కష్టం అవుతోందని గత కొద్దిరోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనల దృష్ట్యా సమస్యను పరిష్కరించేందుకు, మత్స్యకారుల వేదన వినేందుకు పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో కాకినాడ కలెక్టరేట్ లో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉప్పాడ సెంటర్లో బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘పరిశ్రమలను మత్స్యకారులెవరూ వద్దు అనడం లేదు. పరిశ్రమల వల్ల వస్తున్న కాలుష్యాన్ని మాత్రమే వారు వ్యతిరేకిస్తున్నారు. ఇది మత్స్యకారులకు అభివృద్ధి మీద ఉన్న అవగాహనకు నిదర్శనం.
 
రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి కీలకం. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీన్ని మనసుతో అర్ధం చేసుకున్న మత్స్యకారులకు కృతజ్ఞతలు. అయితే మత్స్యసంపదను, వారి జీవనభృతిని దెబ్బతీస్తున్న కాలుష్యాన్ని అరికట్టడంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలి. తీర ప్రాంతంతో పాటు పిఠాపురం చుట్టు పక్కల ప్రాంతాల్లోకి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం మీద కూడా ఆడిట్ చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నాం. దీనిపై ఓ ప్రత్యేకమైన కమిటీ వేసి సమస్యను గుర్తించడమే కాదు.. దాని పరిష్కారాన్ని చూపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం.
 
సముద్రంలోకి వెళ్లి కాలుష్యాన్ని పరిశీలిస్తా – డిప్యూటీ సీఎం
 
మత్స్యకారుల సమస్యపై ఏదో ఒకటి చెప్పి, చప్పట్లు కొట్టించుకొని వెళ్లిపోవడానికి నేను రాలేదు. మీలో ఒకడిగా సమస్యను వింటాను. అర్ధం చేసుకుంటాను. నా సోదర మత్స్యకారులు తమ బాధలో ఏదైనా మాట అంటే పడతాను. ప్రస్తుత కాలుష్య సమస్య ఇప్పటిది కాదు. 2005 ప్రాంతంలోనే నక్కపల్లి సెజ్ కు, ఇక్కడి పరిశ్రమల స్థాపనకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారు. గతంలో పెట్టిన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, అసలు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని చూసేందుకు నేరుగా ఓ పడవలో సముద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మరో రెండు, మూడు రోజుల్లో ఇక్కడకు వచ్చి సముద్రంలోకి వెళ్లి కాలుష్య సమస్యను తెలుసుకుంటాను.
 
మత్స్యకారులు మనసున్న వారు. ఎవరికీ అపకారం చేయాలని, పొట్ట కొట్టాలని అనుకోరు. వేటకు వెళ్లేవారికి కాస్త కోపం సహజం. ఆ కోపంలో నన్ను ఏమైనా అన్నా, పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే పారిశ్రామిక వేత్తలను కొందరు రాజకీయ నాయకులు మత్స్యకారులను అడ్డు పెట్టుకొని బెదిరించినా, భయపెట్టినా సహించేది లేదు. మత్స్యకారులు కూడా అలాంటి వారి వలలో పడొద్దని కోరుతున్నాను. పరిశ్రమల కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి పరిహారం అందాలి..? దానికున్న మార్గాలను కూడా విపులంగా చర్చిస్తాం.
 
రాష్ట్రంలో ఆక్వా రంగానిది కీలకమైన స్థానం. రూ.1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ప్రత్యక్షంగా 3.72 లక్షల మందికి, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఆక్వా రంగంలోనూ కాలుష్య సమస్యలున్నాయి. గతంలో భీమవరంలో ఆక్వా పార్కు గురించి జరిగిన వివాదంలో పోలీసు కేసులు మిగిలాయి తప్ప, సమస్యకు పరిష్కారం రాలేదు. మత్స్యకారులకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యకు పరిష్కార మార్గం రాష్ట్రం మొత్తం మీద ఓ రోల్ మోడల్ కావాలి. దీన్ని రాష్ట్రమంతటా అమలు చేసేలా సర్వ ఆమోదిత మార్గం తీసుకొస్తాం. జనసేన పార్టీ విధానం కూడా పర్యావరణానికి చేటు చేయని అభివృద్ధి ప్రస్థానం. దాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. తెలంగాణ తరహాలో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసే ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తాం. దానికి ముందున్న మార్గాలను వెతుకుతాం.
ఉప్పాడ సీ ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మించే బాధ్యత తీసుకుంటాను
 
ఉప్పాడ ప్రాంతంలో మరో కీలకమైన సమస్య తీర ప్రాంత కోత నివారణ. ఏటా 20 నుంచి 25 మీటర్ల ప్రాంతం కోతకు గురవుతోంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించాం. వేగంగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న నేపథ్యంలో కోస్టల్ రెగ్యూలేటరీ అథారిటీ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. దానికి పరిష్కార మార్గాలను సూచించారు. అధికారులు తీర ప్రాంతం రక్షణ గోడ నిర్మాణ నిమిత్తం రూ.323 కోట్లు అవసరం అవుతుందని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు అయ్యాయి. ఈ నెల 14వ తేదీన మరో సమావేశం ఉంది. కచ్చితంగా కేంద్ర పెద్దలను ఒప్పించి అయినా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణాన్ని ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే భారీ స్థాయి నిధులు కావడంతో దశలవారీగా వచ్చేలా చూస్తాను.
 
 
దీనిపై కేంద్రం సానుకూలంగానే ఉంది. దీంతో పాటు రూ.5.65 కోట్ల నిధులతో ఉప్పాడ – కోనపాపపేట మార్గం నిర్మాణం త్వరలో జరగనుంది. సముద్ర రక్షణ గోడ నా హయాంలోనే పూర్తవుతుంది. నా మీద నమ్మకం ఉంచండి. నేను మీలో ఒకడిగానే ఇక్కడి సమస్యలను పరిష్కరించేలా దృష్టి పెడతాను’’ అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ , డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నేత మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు.
 
The post Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty ResponseSonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty Response

Bollywood actress Sonakshi Sinha has finally addressed the persistent rumours surrounding her pregnancy in a humorous way. The actress, who recently attended an event with her husband Zaheer Iqbal, found