hyderabadupdates.com movies రెండు ఇండ‌స్ట్రీ హిట్లు.. ఒక యావరేజ్.. నెక్స్ట్ ఏంటి..

రెండు ఇండ‌స్ట్రీ హిట్లు.. ఒక యావరేజ్.. నెక్స్ట్ ఏంటి..

మ‌ల‌యాళ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మోహ‌న్ లాల్ టైం మామూలుగా న‌డ‌వ‌ట్లేదు. ఎప్ప‌ట్నుంచో అక్క‌డ ఆయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరో. రికార్డుల్లో చాలా వ‌ర‌కు ఆయ‌న పేరిటే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ 2025 ఆయ‌న‌కు చాలా చాలా స్పెష‌ల్. ఈ ఏడాది ఆరంభంలో ఎల్-2 ఎంపురాన్ మూవీతో ఆయ‌న ఇండ‌స్ట్రీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. కొంచెం మిక్స్డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ రూ.268 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి మాలీవుడ్ హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఆ సినిమా వ‌చ్చిన రెండు నెల‌ల‌కే తుడరుమ్ మూవీతో మ‌ళ్లీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు మోహ‌న్ లాల్. ఆ సినిమా కేర‌ళ‌లో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది.

ఇక వినాయ‌క చ‌వితి వీకెండ్లో రిలీజైన మోహ‌న్ లాల్ చివ‌రి చిత్రం హృద‌య పూర్వం మాత్రం యావరేజ్ అయింది. అది వంద కోట్లు రాబట్టలేకపోయింది కానీ కంటెంట్ పరంగా ఒక మాదిరి టాక్ తెచ్చుకుంది. ఇలా ఆరునెల‌ల వ్య‌వ‌ధిలో రెండు ఘ‌న‌విజ‌యాలు సొంతం చేసుకున్నాడు మోహ‌న్ లాల్. ఇలా హిట్లు కొడుతూనే.. చ‌క‌చ‌కా సినిమాలు లాగించేస్తూ రిలీజ్‌కు రెడీ చేయ‌డం మోహ‌న్ లాల్‌కే చెల్లింది.

ఈ ఏడాది లాలెట్ట‌న్ నుంచి నాలుగో సినిమా రాబోతోంది. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర పోషించిన వృష‌భ చిత్రం న‌వంబ‌రు 7న‌ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇది పాన్ ఇండియా మూవీ. మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, హిందీల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. ఈ సినిమాకు తెలుగు క‌నెక్ష‌న్ ఉంది. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ మేకా ఇందులో కీల‌క పాత్ర చేశాడు.

పెళ్ళిసంద‌డి త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోష‌న్.. తెలుగులో ఛాంపియ‌న్ మూవీతో పాటు వృష‌భ న‌టించాడు. ఛాంపియ‌న్ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌రులో రిలీజ్ కానుండ‌గా.. నెల‌న్న‌ర ముందే వృష‌భ రాబోతోంది. హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బ‌డ్జెట్లో రూపొందిన ఈ చిత్రాన్ని నంద‌కిషోర్ రూపొందించాడు. అత‌ను క‌న్న‌డ‌లో పొగ‌రు స‌హా ప‌లు చిత్రాలు రూపొందించాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఏక్తా క‌పూర్ ప్రొడ్యూస్ చేయ‌డం విశేషం. మోహ‌న్ లాల్ గ‌త ద‌శాబ్ద కాలంలో బ‌రోజ్, మ‌ర‌క్కార్ లాంటి హారీ హిస్టారిక‌ల్ మూవీస్ చేశాడు. కానీ అవి నిరాశ‌ప‌రిచాయి. మ‌రి వృష‌భ ఆయ‌న‌కు మంచి ఫ‌లితాన్నందించి 2025ను మ‌రింత మ‌ధురంగా మారుస్తుందేమో చూడాలి.

Related Post