గత నెల ఆరంభంలో లిటిల్ హార్ట్స్‌తో మొదలుపెట్టి.. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఆ సినిమా కొన్ని వారాల పాటు మంచి వసూళ్లు సాధించింది. తర్వాతి వారం వచ్చిన మిరాయ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. కిష్కింధపురి సైతం బాగా ఆడింది. ఇక నెల చివర్లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
ఇక దసరా వీకెండ్లో విడుదలైన కన్నడ అనువాదం కాంతార: చాప్టర్-1 తొలి వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టింది. ఇక కొత్త వారంలో కొత్త సినిమాల జోరేమైనా ఉంటుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఈ వారం విడుదలైనవన్నీ చిన్న చిత్రాలే. అవేవీ ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. శశివదనే, అరి, కానిస్టేబుల్ సినిమాలు తక్కువ థియేటర్లలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలయ్యాయి. వీటిలో ఏ సినిమాకూ పాజిటివ్ టాక్ రాలేదు.
టాక్ సంగతి పక్కన పెడితే.. వీటి పట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. థియేటర్లు ఖాళీగా కనిపించాయి. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో ముందు వారాల్లో విడుదలైన సినిమాల పట్ల ప్రేక్షకులు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శుక్రవారం కాంతార ప్రీక్వెల్‌కు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలకు హౌప్ ఫుల్స్ పడ్డాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి.
సింగిల్ స్క్రీన్లలో కూడా ఆక్యుపెన్సీలు పర్వాలేదు.దీపావళి సినిమాలు వచ్చే వరకు కాంతారకు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ బాక్సాఫీస్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ సినిమాకు వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. తొలి వీకెండ్ తర్వాత పవన్ సినిమా డౌన్ అయనప్పటికీ.. వీకెండ్ వచ్చే సమయానికి రేట్లు తగ్గించడం కలిసొచ్చింది. కాంతార నుంచి పోటీని తట్టుకుని ఆ సినిమా బాగానే నిలబడుతోంది. శని, ఆదివారాల్లో కాంతార, ఓజీలకు మరింత మెరుగైన వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.