IPS officer : హరియాణాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై అధికారులు వేటు వేశారు. బిజార్నియా స్థానంలో రోహ్‌తక్ ఎస్పీగా సురీందర్ సింగ్ భోరియా నియమితులయ్యారు. పూరన్ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో హరియాణా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఎస్పీని పదవి నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అమ్నీత్ కుమార్‌కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని… ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారంటూ ఆమె రాసుకొచ్చారు.
IPS officer – పూరన్ కుమార్ ఆత్మహత్యపై సిట్
హరియాణాకు (Haryana) చెందిన సీనియర్ పోలీస్ అధికారి వై.పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో సత్వర, నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు కోసం చండీగఢ్ పోలీసులు శుక్రవారం ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సిట్ కు చండీగఢ్ ఐజీ పుప్పేంద్ర కుమార్ నాయకత్వం వహిస్తారు. చండీగఢ్ ఎస్‌ఎస్‌పీ కన్వర్‌దీప్ కౌర్, సిటీ ఎస్పీ కేఎం ప్రియాంక, డీఎస్‌పీ చరణ్‌జిత్ సింగ్ విర్క్, ఎస్‌డీపీవో (సౌత్) గుర్జీత్ కౌర్, సెక్టార్ 11 పోలీస్ స్టేషన్ (వెస్ట్) ఎస్‌హెచ్‌వో జైవీర్ రాణా సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారి (IPS officer) పూరణ్ కుమార్ మంగళవారం చండీగఢ్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడం తెలిసిందే. ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. ‘కేసులోని ఆరోపణల తీవ్రత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని… ఐజీపీ, యూటీ, చండీగఢ్ పర్యవేక్షణలో కేసుపై సత్వర, నిష్పక్షపాత, సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి సిట్ ఏర్పాటు చేశాం..’అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 156/2025లోని అన్ని అంశాలపై సిట్ దర్యాప్తు చేయాలని, ఇందులో సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల విచారణ, నిపుణుల అభిప్రాయాలు, న్యాయ సలహాలు వంటివి కాలపరిమితిలో చేపట్టి, పూర్తయ్యాక తుది నివేదికను సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
పూరణ్ కుమార్ (Pooran Kumar) ఆత్మహత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదైన ఒకరోజు తర్వాత, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమనీత్ పి.కుమార్ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో సమాచారం అసంపూర్తిగా ఉందని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను సవరించి, నిందితులందరి పేర్లు ఉండేలా రూపొందించాలని ఆమె పోలీసులను కోరారు. ఈ మేరకు చండీగఢ్ ఎస్‌ఎస్‌పీ కన్వర్‌దీప్ కౌర్‌కు రాసిన లేఖలో, ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన బలహీనమైన ఎస్సీ/ఎస్టీ చట్టం సెక్షన్లను సవరించాలని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన ఐపీఎస్ అధికారి.. తన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌లో కొంతమంది అధికారులు కుల వివక్షతో చేసిన వేధింపుల వివరాలను కూడా పేర్కొన్నారు.
బుధవారం చండీగఢ్ పోలీసులకు అమనీత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో, హరియాణా డీజీపీ, రోహ్‌తక్ ఎస్పీపై సెక్షన్ 108 బీఎన్‌ఎస్, 2023 (ఆత్మహత్యకు ప్రేరణ), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టంలోని ఇతర నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వారిని తక్షణమే అరెస్టు చేయాలని అభ్యర్థించారు. పూరణ్ కుమార్, ఇటీవల రోహ్‌తక్ సునారియాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. హరియానా ప్రభుత్వ ప్రతినిధి బృందంతో జపాన్‌లో పర్యటిస్తున్న అమనీత్ కుమార్ భర్త ఆత్మహత్య సమాచారం తెలిసి, బుధవారం హుటాహుటిన చండీగఢ్‌కు చేరుకున్నారు. ఉన్నత స్థాయి అధికారుల వ్యవస్థీకృత వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆమె ఆరోపించారు. ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన స్థలం నుంచి పోలీసులు మంగళవారం స్వాదీనం చేసుకున్న వస్తువులలో వీలునామా, సూసైడ్ నోట్ ఉన్నాయి.
Also Read : Prashant Kishor: రాహుల్ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్ కిశోర్
The post IPS officer: హరియాణా ఐపీఎస్ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
IPS officer: హరియాణా ఐపీఎస్ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు
Categories: