IRCTC Scam : బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన సతీమణీ రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై అభియోగాలు మోపాలని ఢిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. అభియోగాలను నమోదు చేసింది. దీంతో కేసు విచారణ దశకు చేరుకుంది. ఈ స్కామ్‌లో లాలూ… కుట్రకు పాల్పడ్డారని, తన పదవిని దుర్వినియోగం చేశారని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసులో నిందితులపై అవినీతి, క్రిమినల్ కుట్ర, మోసం వంటి పలు అభియోగాలను ఖరారు చేశారు.
IRCTC Scam – Lalu Prasad Yadav
కాగా, ఐఆర్‌సీటీసీ కేసులో (IRCTC Scam) లాలూ కుటుంబంపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పూరి, రాంచీ హోటల్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది. 2017లో లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఆరోపణలతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. అనంతరం, ఐఆర్‌సీటీసీ కేసులో అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లాలూ స్పందిస్తూ.. అభియోగాలు మోపినంత మాత్రాన దోషులం కాదు. విచారణను ఎదుర్కొంటామని వెల్లడించారు.
కాగా, ఈ కేసు 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న కాలం నాటిది. రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను సుజాత హోటల్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం.. 2004-2014 మధ్య పూరి, రాంచీలోని బీఎన్‌ఆర్ హోటల్స్‌ను భారతీయ రైల్వేల నుంచి ఐఆర్‌సీటీసీకి బదిలీ చేయడంలో కుట్ర జరిగిందని, ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ హోటల్స్‌ను నిర్వహణ కోసం పాట్నాలో ఉన్న సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. నిబంధనలు మార్చడం ద్వారా సుజాత హోటల్స్‌కు అనుకూలంగా టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని సీబీఐ ఆరోపించింది. చార్జిషీట్‌లో ఐఆర్‌సీటీసీ గ్రూప్ మాజీ జనరల్ మేనేజర్లు వీకే అస్తానా, ఆర్‌కే గోయల్‌తో పాటు, సుజాత హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ యజమానులు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్‌ల పేర్లు కూడా ఉన్నాయి.
మరోవైపు.. బీహార్‌లో (Bihar) రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
IRCTC Scam – రాజకీయ కక్షతోనే కేసు – తేజస్వి యాదవ్
ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పైన, తన తల్లి రబ్రీదేవి, తనపైన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు అభియోగాలు దాఖలు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఈ కేసుపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయ ప్రతీకారంతో పెట్టిన కేసు ఇదని, లాలూ ప్రసాద్ యాదవ్ చరిత్ర సృష్టించిన రైల్వే మంత్రి అని, ఈ నిజం బీహార్ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి తెలుసునని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ తేజస్వి చెప్పారు. ‘ఈ కేసుపై పోరాడతాం. ఎన్నికలు దగ్గర పడినప్పుడు కేసును తెరపైకి తెస్తారనే విషయాన్ని మొదట్నించి నేను చెబుతూనే ఉన్నాను. కోర్టు తీర్పును గౌరవిస్తున్నాను. దీనిపై మేము పోరాడతాం. బీహార్ ప్రజలు చాలా తెలివైనవారు, ఏం జరిగిందో వారందరికీ తెలుసు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షే’ అని అన్నారు.
రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్‌లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. లాలూను స్టడీ చేసేందుకు హార్వార్డ్ నుంచి విద్యార్థులు కూడా వస్తుంటారని, మేనేజిమెంట్ గురుగా ఆయనకు ఎంతో పేరుందని చెప్పారు. ఈ నిజం బీహార్ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి తెలుసునని అన్నారు. తాను బతికున్నంత కాలం బీజేపీపై పోరాడుతూనే ఉంటానని తేజస్వి స్పష్టం చేశారు.
ఐఆర్‌సీటీసీ హోటల్ అవినీతి కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వి తదితరులపై మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలను ఢిల్లీ కోర్టు సోమవారంనాడు దాఖలు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచీ, పూరీలో ఐఆర్‌సీటీసీ హోటల్స్‌కు టెండర్లలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో నిందితులు 14 మందిపై అభియోగాల నమోదుకు తగిన ఆధారాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే తాము ఎలాంటి తప్పిదాలు చేయలేదని, కేసును ఎదుర్కొంటామని లూలా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Also Read : Jyoti Singh: బిహార్ ఎన్నికల బరిలో స్టార్ హీరో భార్య
The post IRCTC Scam: బీహార్ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
IRCTC Scam: బీహార్ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్ షాక్
Categories: