Google : విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిల్లీలో గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ (Google) క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ (Google) క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు. వైజాగ్‌ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఏటా రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Google Data Center in Visakhapatnam
విశాఖలో రూ.87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది.
గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ – గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ… గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ ఉండబోతుందని తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని స్పష్టం చేశారు. జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లల్లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు. భారత దేశానికే కాదు.. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ స్పష్టం చేశారు.
అప్పుడు మైక్రోసాఫ్ట్… ఇప్పుడు గూగుల్ – సీఎం చంద్రబాబు
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) విశాఖలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని… ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై దిల్లీలో ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా ‘భారత్ ఏఐ శక్తి’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… ‘‘ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం. ప్రస్తుతం విశాఖకు గూగుల్‌ను తీసుకొస్తున్నాం. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవి. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం. ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషదాయకం అన్నారు.
డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకురావడంలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం, ఐటీ రంగాన్ని ప్రోత్సహించా. ఐటీతో చాలా కాలంగా అనుసంధానమై ఉన్నా. రియల్‌టైమ్ డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ప్రత్యేకం. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గరచేసేలా ప్రయత్నిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.
నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు – అశ్వినీ వైష్ణవ్
సాంకేతికత ప్రపంచాన్నే మార్చేస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయన్నారు.
Also Read : KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు
The post Google: విశాఖలో గూగుల్ డేటాసెంటర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Google: విశాఖలో గూగుల్ డేటాసెంటర్
Categories: