ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న సిట్ అధికారులు ఇక్కడి ఫిల్మ్ నగర్‌లో ఉన్న మిథున్ రెడ్డి నివాసానికి వెళ్లి.. స్థానిక పోలీసుల సహకారంతో సిబ్బందిని తొలుత తమ అధీనంలోకి తీసుకున్నారు.
అనంతరం.. ఇంటి మొత్తాన్నీ తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే.. ఈ తనిఖీల వ్యవహారం మిథున్ రెడ్డికి తెలియదని సమాచారం. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పత్రాలు.. నాడు డిస్టిలరీలతో చేసుకున్న ఒప్పందాలపై సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి తీసుకుని.. మిథున్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. కాగా.. గతంలోనూ ఈ కేసులో ఏ-1గా ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలోనూ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో కోటి రూపాయల నగదు, బంగారు, కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ క్రమంలో రెండోసారి మిథున్‌రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ వ్యవహారాన్నిగోప్యంగా ఉంచిన అధికారులు.. కేవలం చివరి నిముషంలో మిథున్ రెడ్డికి సమాచారం అందించినట్టు తెలిసింది.
మరింత బిగిసిన ఉచ్చు..
ఈ పరిణామాలతో ఇక, మద్యం కుంభకోణం తేలిపోయిందని అనుకున్న వైసీపీ నాయకులకు మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుందనిపరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కుదిపేసిన ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే అనేక మందిఅరెస్టు అయ్యారు. ఇప్పుడు చేస్తున్న సోదాలతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.