మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ దసరా మిస్ చేసుకున్నా దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దీని కోసమే మన శంకరవరప్రసాద్ గారు మీసాల పిల్లని సందర్భం లేకపోయినా హఠాత్తుగా రిలీజ్ చేశారు. తాజా ట్విస్ట్ ఏంటంటే పండక్కు పెద్ది పాట రాకపోవచ్చు. ప్రస్తుతం దీని షూటింగే జరుగుతోంది. ఇంకా రీ రికార్డింగ్, కలర్ కరెక్షన్, మిక్సింగ్ లాంటి చాలా పనులున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఇవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఆయనేమో చాలా బిజీగా ఉన్నాడు. కొంచెం టైం ఇమ్మని అడిగాడని సమాచారం.
ఎలాగూ వచ్చే నెల హైదరాబాద్ లో రెహమాన్ లైవ్ కన్సర్ట్ జరుగుతోంది కాబట్టి వేలాది అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ లోగా వీడియో పనులు పూర్తి చేసుకోవచ్చు. హడావిడి పడి లేనిపోని ఒత్తిడి తీసుకుని సగం ఉడికిన కంటెంట్ ఇచ్చే ఉద్దేశంలో బుచ్చిబాబు లేడు. అందుకే ఖరాఖండీగా వచ్చే నెల పోస్ట్ పోన్ చేసుకున్నాడట. మ్యూజిక్ పరంగా పెద్ది నుంచి వస్తున్న మొదటి పాట కావడంతో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో బుచ్చిబాబుకి తెలియంది కాదు. అందుకే రాజీ లేకుండా లేట్ అయినా పర్వాలేదంటూ క్వాలిటీ మీద దృష్టి పెడుతున్నాడు.
మార్చి 27 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఆ మేరకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. బిజినెస్ పరంగా ఇంకా ఏ ఏరియాలు ఫైనల్ చేయలేదు. ట్రైలర్ వచ్చాక క్లోజ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. డిమాండ్ అయితే ఆర్ఆర్ఆర్ దగ్గరగా ఉందని, సోలో హీరోగా చరణ్ కు ఎప్పుడూ రానంత నెంబర్లు దీనికి నమోదవ్వొచ్చని అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా జగపతిబాబు, దివ్యెందు శర్మ విలన్లుగా నటిస్తున్నారు. బడ్జెట్ ఎంతో బయటకి చెప్పడం లేదు కానీ రెండు వందల కోట్ల పైమాటేనని టాక్.