Afghanistan: దేశరాజధాని ఢిల్లీలో అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ (Amir Khan Muttaqi) ఏర్పాటుచేసి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమిర్‌ఖాన్ సమావేశంలో మహిళా జర్నలిస్టులు కనిపించలేదంటూ వస్తోన్న కథనాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందించింది. ఆ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘‘అఫ్గాన్ (Afghanistan) మంత్రి పర్యటన వేళ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి భారత్‌లోని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయం ఎంపిక చేసిన జర్నలిస్టులకు ఆహ్వానం అందింది. ఈ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాదు’’ అని కేంద్రం వెల్లడించింది.
Afghanistan Foreign Minister Press Meet in Delhi
శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో అఫ్గాన్ మంత్రి ముత్తఖీ (Amir Khan Muttaqi) ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత ఆయన అఫ్గాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొందరు పురుష జర్నలిస్టులు, అఫ్గాన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో ముత్తఖీ (Amir Khan Muttaqi) భారతదేశం- అఫ్గాన్ సంబంధాలు, పరస్పర మానవతా సహాయం, వాణిజ్య విధానాలు, భద్రతా సహకారం తదితర ప్రాంతీయ అంశాలపై మాట్లాడారు.
ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కొందరు మహిళా పాత్రికేయులు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ స్పందించారు. ‘‘మహిళా జర్నలిస్టులు పాల్గొనకుండా అడ్డుకునేందుకు అనుమతించడం ద్వారా.. మీరు వారికోసం నిలబడలేరని తెలుస్తోంది’’ అని ప్రధాని మోదీని రాహుల్ విమర్శించారు. మన దేశంలో ప్రతి మహిళకు సమాన భాగస్వామ్యం పొందే హక్కు ఉందన్నారు. ఇలాంటి చర్యలను ఎలా అనుమతించారని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. మహిళలను అనుమతించనప్పుడు పురుష జర్నలిస్టులు ఆ సమావేశం నుంచి బయటకు వచ్చేయాల్సిందని కేంద్రమాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. ఇది షాకింగ్ ఘటన అని వ్యాఖ్యానించారు.
మహిళా జర్నలిస్టుల నిషేదంపై స్పందించిన తాలిబన్ ప్రతినిధి
ముత్తాఖీ (Amir Khan Muttaqi) పాల్గొన్న మీడియా సమావేశంలో తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను మినహాయించలేదని తాలిబన్ అధికారి వెల్లడించారు. ‘‘మహిళలపై ఎలాంటి వివక్షాపూరిత విధానం లేదు. పాస్‌ల సంఖ్య పరిమితంగా ఉంది. కొందరికి మాత్రమే అవి అందాయి. ఇదొక సాంకేతిక అంశం మాత్రమే. దీన్నొక విధానపరమైన సమస్యగా చూడొద్దు’’ అని ఓ జాతీయమీడియా సంస్థతో మాట్లాడారు.
పాకిస్థాన్‌తో ఘర్షణల వేళ… ముత్తాఖీ గురువారం భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. 2021తో తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గాన్ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలాఉంటే.. అఫ్గానిస్థాన్ ను చేజిక్కించుకున్న తాలిబన్లు అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నారు. మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే.
ఇండియాకు వచ్చి ఇదేం పని – బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్
అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. మహిళలను మనుషులుగానే తాలిబాన్లు చూడడం లేదంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లింగ వివక్ష పాటించిన మీడియా సమావేశాన్ని ఎందుకు బహిష్కరించలేదని పురుష జర్నలిస్టులను ప్రశ్నంచారు.
”అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారతదేశానికి వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆయన అనుమతించలేదు. తాలిబన్లు ఆచరించే ఇస్లాంలో.. మహిళలు ఇంట్లోనే ఉండి పిల్లలను కనాలని, వారి భర్తలు, పిల్లలకు సేవ చేయాలని మాత్రమే భావిస్తున్నారు. పాఠశాలలు, పని ప్రదేశాల్లోనే కాదు.. ఇంటి వెలుపల ఎక్కడా కూడా మహిళలను చూడటానికి ఈ స్త్రీ ద్వేషపూరిత పురుషులు ఇష్టపడరు. మహిళలను అసలు మనుషులుగానే పరిగణించరు. అందుకే స్త్రీలకు మానవ హక్కులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. పురుష జర్నలిస్టులకు ఏదైనా మనస్సాక్షి ఉంటే, వారు విలేకరుల సమావేశం నుండి వాకౌట్ చేసి ఉండేవారు. నీచమైన స్త్రీ ద్వేషంపై నిర్మించిన దేశం అనాగరిక రాజ్యం. ఏ నాగరిక దేశం కూడా దాన్ని గుర్తించకూడద”ని తస్లీమా నస్రీన్ ‘ఎక్స్’లో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Supreme Court: వాట్సప్ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టు
The post Afghanistan: అఫ్గాన్ మంత్రి ప్రెస్‌మీట్ లో మహిళలపై ‘నిషేధం’ ఆరోపణపై స్పందించిన కేంద్రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Afghanistan: అఫ్గాన్ మంత్రి ప్రెస్‌మీట్ లో మహిళలపై ‘నిషేధం’ ఆరోపణపై స్పందించిన కేంద్రం
Categories: