భారత్ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే… వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బిహార్‌లో ప్రతిపాదిత రక్షణరంగ పరిశ్రమల నడవాలో తయారయ్యే పేలుడు పదార్థాలనే ఆ ఉగ్రవాదులపై వాడతామని చెప్పారు. పహల్గాంలో మన పౌరులపై దాడి చేసి, ఆడబిడ్డల నుదుటిపై సిందూరాన్ని తుడిచేసిన ముష్కరులపై 20 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. అమిత్ షా మంగళవారం బీహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే ఫిరంగులను పాక్ ముష్కర మూకలపై ఎక్కుపెట్టనున్నట్లు స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ భద్రతను నిర్లక్ష్యం చేశామని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తే బీహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వస్తుందని ప్రజలను అమిత్ షా అప్రమత్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘షాబుద్దీన్ అమర్ రహే’ అంటున్నారని ఆక్షేపించారు. జంగిల్‌రాజ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు ఆరాటపడుతున్నారని, ప్రజలు అందుకు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంపైనున్న కమలం గుర్తుపై మీటను నొక్కితే సుపరిపాలన వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రను అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు.
ఇటీవల బిహార్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమచేసిన రూ.10వేలను ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ సొమ్మును ఆర్జేడీ నేతలు దోచుకోవాలని చూస్తున్నారని, లాలూ తాతలు దిగొచ్చినా అది సాధ్యం కాదని చెప్పారు. ఆర్జేడీ పాలనలో బిహార్ ఎలా రక్తసిక్తమైందో గుర్తుచేసుకోవాలన్నారు. అక్రమ వలసదారుల్ని రక్షించేందుకు రాహుల్‌గాంధీ ఎన్ని సభలు నిర్వహించినా తాము మాత్రం వారిని తరిమికొట్టడం ఖాయమని తేల్చిచెప్పారు.
ఎన్డీయేతోనే బిహార్ అభివృద్ధి -రాజ్‌నాథ్
ఎన్డీయే పాలనలోనే బిహార్ అభివృద్ధి బాటలో నడుస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. వైశాలీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆర్జేడీ నేతలు తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సిన డబ్బు ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు.
పేదల హక్కుల్ని దోచుకుని భారీ వాగ్దానాలు చేస్తున్నారు – యోగి
సమస్తీపుర్: బిహార్‌కు ఏదేదో చేసేస్తామని పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తున్నవారు 20 ఏళ్ల క్రితం యువత ఉద్యోగాలను దోచుకుని, పేదల హక్కుల్ని లాక్కొన్నారని, ఆటవిక రాజ్యం తెచ్చారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. 2005లో నీతీశ్‌కుమార్ అధికారంలోకి వచ్చాకే సుపరిపాలన సాధ్యమైందని మంగళవారం సమస్తీపుర్, లఖిసరాయ్ సభల్లో మాట్లాడుతూ తెలిపారు. ఎన్డీయే ఏలుబడిలో అన్ని రంగాల్లో బిహార్ అభివృద్ధి చెందిందన్నారు. యూపీలో మాఫియాలను బుల్డోజర్లతో అణచివేసి, వారి ఆస్తుల్ని పేదలకు పంచినట్టే బిహార్‌లోనూ చేస్తామని చెప్పారు.
ప్రధానిది నకిలీ డిగ్రీ – రాహుల్ గాంధీ
విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి ముఖ్యమైన సమస్యల నుంచి యువత దృష్టి మళ్లించడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. యువత నిరంతరం సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేసుకుంటుంటే కీలక సమస్యలపై నిలదీయరనే ఉద్దేశంతోనే ఆయన దీన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బిహార్‌లో తొలిదశ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన మంగళవారం రాహుల్.. ఔరంగాబాద్, గయాజీలలో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ‘‘రీల్స్‌కు బానిసలై యువతీయువకులు ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో గడపాలని మోదీ కోరుకుంటున్నారు. 21వ శతాబ్దంలో ఇదొక కొత్త మత్తు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయకుండా యువత ఆలోచనల్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ. మోదీది నకిలీ డిగ్రీ. అందుకే విద్యారంగంపై ఆయన అనాసక్తితో ఉంటారు. నలంద విశ్వవిద్యాలయం గొప్పతనం ఆయనకు తెలియదు’’ అని చెప్పారు.
ఓట్లచోరీతో అశాంతికి ఆజ్యం
‘‘మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా కలిసి బిహార్‌లో ఓటుచోరీకి పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని వారికి తెలుసు. కాంగ్రెస్-ఆర్జేడీ గానీ అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యం మళ్లీ వస్తుందని మోదీ చెబుతారు. నిజానికి ఓట్లచోరీ ద్వారా అశాంతిని ప్రోత్సహిస్తున్నదే ఆయన’’ అని రాహుల్ విమర్శించారు.
మీరు కోరుకుంటున్న భవిష్యత్తు ఇదేనా?
‘‘నీతీశ్ గత 20 ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నా బిహార్ అభివృద్ధి చెందట్లేదు. నేను కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ఇలా ఎక్కడికి వెళ్లినా అక్కడ బిహార్ యువతను గమనిస్తున్నాను. మీరందరూ కష్టపడి పనిచేస్తారు. భారీ భవనాలు, వంతెనలు, సొరంగాలను నిర్మించేది బిహార్ యువతే. ఎక్కడికి వెళ్లినా మీరు కార్మికులుగానే పనిచేయాలి. మీరు కోరుకుంటున్న భవిష్యత్తు ఇదేనా? జీవితాంతం శ్రమతోనే గడపాలనుకుంటున్నారా?’’ అని యువతను రాహుల్ ప్రశ్నించారు.
The post Amit Shah: పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Amit Shah: పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
Categories: