Amit Shah : తనయుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, కుమారుడు తేజస్విని బిహార్ కు ముఖ్యమంత్రిగా చూడాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పరితపిస్తున్నా ఆ రెండు పదవులూ ఖాళీగా లేవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) వ్యాఖ్యానించారు. బుధవారం దర్భంగా, సమస్తీపుర్, బెగుసరాయ్‌లలో ఎన్డీయే కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్‌ఐ)పై కేంద్రం నిషేధం విధించి దాని సభ్యులను అరెస్టుచేసినా… కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి గానీ అధికారంలోకి వస్తే వారు కటకటాల వెనుక ఉంటారా అని అమిత్ షా ప్రశ్నించారు. మహాగఠ్ బంధన్‌ను దోపిడీదొంగల కూటమిగా అభివర్ణించారు. దాణా, తారు, ఉద్యోగాల కుంభకోణంలో లాలూప్రసాద్ ఉన్నారని, రూ.12 లక్షల కోట్ల అవినీతి కేసుల్లో కాంగ్రెస్ (Congress) కూరుకుపోయిందని ఆరోపించారు.
‘‘చొరబాటుదారుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని రాహుల్ (Rahul Gandhi), లాలూ కోరుకుంటున్నారు. ఆటవిక రాజ్యాన్ని మళ్లీ తీసుకురావాలని రాహుల్, తేజస్వి కోరుకుంటున్నారు. దీనిని మేం జరగనివ్వం. పంచపాండవుల్లాంటి పార్టీలున్న బలమైన ఎన్డీయే ఈసారి కూడా ఘనమైన విజయంతో బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. నీతీశ్ నాయకత్వం, చిరాగ్ పాస్వాన్ ఉత్సాహం, జీతన్‌రామ్ మాంఝీ జీవితకాల అనుభవం, ఉపేంద్ర కుశ్వాహా మద్దతు మా కూటమిలో కనిపిస్తాయి. జగ్జీవన్‌రామ్‌ను ప్రధానిని కానివ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అసలు రూపాన్ని ప్రజలు చూశారు. బిహార్ అభివృద్ధికి లాలూ-రబ్రీదేవి ఏమీ చేయలేకపోయారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం గురించి మహాగఠ్‌బంధన్ ఆలోచించదు’’ అని చెప్పారు.
Amit Shah – అద్వానీ రథయాత్రను అడ్డుకున్న పాపం వారిదే – యోగి
అద్వానీ రథయాత్రను అడ్డుకున్నారంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. 1990లో సమస్తిపుర్‌లో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. ఆ చర్యను ‘పాపం’గా అభివర్ణించారు. ఇవాళ బుధవారం(అక్టోబర్ 29) బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. సివాన్, భోజ్‌పూర్, బక్సర్ జిల్లాల్లో మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రామ మందిర నిర్మాణం… దేశంపై 500 ఏళ్ల మచ్చను తొలగించిందని యోగి అన్నారు. ఆర్జేడీ మిత్రపక్షమైన కాంగ్రెస్.. రాముడు లేడని చెబుతోందంటూ.. 2007లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌ను ఆయన ఉదాహరించారు. ఆర్జేడీ అభ్యర్థి ఒసామా షహాబ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తండ్రి మొహమ్మద్ షహాబుద్దీన్ దేశవ్యాప్తంగా భయంకర గ్యాంగ్‌స్టర్‌గా పేరుగాంచిన వ్యక్తి అంటూ యోగి ఆరోపించారు. ఆర్జేడీ మళ్లీ ‘జంగిల్ రాజ్’ను తీసుకురావాలని చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, భద్రతకు కట్టుబడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం కార్పూరీ ఠాకూర్, జగ్జీవన్ రామ్, రాజేంద్ర ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలపై పనిచేస్తోంది. సీతామఢి జిల్లాలో సీతాదేవి ఆలయ నిర్మాణానికి ఆర్జేడీ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. అయోధ్య ధామ్ నుంచి సీతామఢి వరకు రూ. 6,100 కోట్లతో కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయని యోగి తెలిపారు.
Amit Shah – ఓట్ల కోసం మోదీ దేనికైనా రెడీ – రాహుల్ గాంధీ
ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏం చేయడానికైనా వెనకాడబోరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ధ్వజమెత్తారు. బుధవారం బిహార్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి ముజఫ్ఫర్‌పుర్, దర్భంగా జిల్లాల్లో సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఛఠ్ పూజ నిర్వహించేందుకు మోదీ యమునా నదీ స్నానానికి వెళ్తున్నారంటూ జరిగిన డ్రామాను చూసే ఉంటారు. పూర్తిగా కలుషితమైన యమునా నదిలో ఆయన స్నానం ఆచరించడానికి శుద్ధ జలాలతో ప్రత్యేక ఏర్పాటు చేశారన్న విషయం బయటకు రావడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
ఎలాంటి డ్రామాకైనా ఆయన సిద్ధమే. నృత్యం చేస్తే మీకే ఓటేస్తామని చెప్పండి.. మోదీ వెంటనే భరతనాట్యం చేసి చూపుతారు’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈసారి బిహార్‌లో ఏర్పాటు కాబోతోందని రాహుల్ జోస్యం చెప్పారు. ‘‘మీరు (మోదీ) ధరించే దుస్తులపై మేడిన్ చైనా అనే లేబుల్ ఉంటుంది. మేడిన్ బిహార్ అనే లేబుల్ ఉన్న దుస్తులు మీరు ధరిస్తే చూడాలనుకుంటున్నాను. పాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నది అబద్ధమైతే ఆ విషయాన్ని ఆయనకు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ప్రధాని ఎలా ఉండాలో మా నానమ్మ ఇందిరాగాంధీని చూసి తెలుసుకోండి’’ అని సూచించారు. మహాగఠ్‌బంధన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తేజస్వి హామీ ఇచ్చారు.
Also Read : Driverless Car: బెంగళూరులో మొదటి డ్రైవర్ రహిత కారు
The post Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Amit Shah: తనయుల కోసం సోనియా, లాలూ ఆరాటం – అమిత్ షా
Categories: