ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలోజన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.
ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందెశ్రీ లోక్‌నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది – తెలంగాణ సీఎం రేవంత్
అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు.
అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది – ఏపీ సీఎం చంద్రబాబు
అందెశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అందెశ్రీ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంలో అందెశ్రీ పాల్గొన్నారని గుర్తుచేశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అందెశ్రీ మృతిపట్ల భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.
పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు
అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
The post Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
Categories: