అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అక్టోబరు 31న ఈడీ ప్రకటించింది. ఈ ఆస్తుల్లో అనిల్ అంబానీ నివాసం ఉంటున్న పాలీ హిల్స్ నివాసం, అతని గ్రూపు సంస్థల పేరు మీద ఉన్న భవనాలు ఉన్నాయి. ఢిల్లీలోని మహారాజా రంజిత్‌సింగ్ మార్గ్‌లో ఉన్న పెద్ద ప్లాట్‌తో పాటు ఢిల్లీ, నోయిడా, గాజియాబాద్, ముంబై, పూణె, థానె, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో రిలయన్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ పేరుతో ఉన్న రియల్ ఎస్టేట్ భూములను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. నవీ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ నాలెడ్జి సిటీలో ఉన్న 132 ఎకరాల భూమి విలువే రూ.4,462 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈడీ చర్యపై రిలయన్స్ ఇన్‌ఫ్రా స్పందిస్తూ… ఆస్తులు తాత్కాలికంగా జప్తు చేసిన విషయం నిజమేనని, అయితే తమ కార్యకలాపాల మీద, ఉద్యోగుల మీద ఈ చర్య ప్రభావం ఏ మాత్రం ఉండబోదని తెలిపింది. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును రిలయన్స్ హోంఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా సొంత అవసరాలకు మళ్లించారన్నది ఆరోపణ. 2017-19 మధ్యకాలంలో ఎస్‌బ్యాంక్ రూ.2,965 కోట్లు రిలయన్స్ హోంఫైనాన్స్ లిమిటెడ్‌లో, రూ.2,045 కోట్లు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టింది. 2019 డిసెంబరు కల్లా ఈ రెండు సంస్థల నుంచి రావాల్సిన మొత్తాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. అప్పటికి రిలయన్స్ హోంఫైనాన్స్ నుంచి రూ.1353.5 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ నుంచి రూ.1,984 కోట్లు తిరిగి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. నిజానికి ఇవి ఎస్ బ్యాంకు సొమ్ము కూడా కాదు.
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నిప్పన్ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందినవి. ప్రజల నుంచి సేకరించిన సొమ్ము అది. సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సొమ్మును అనిల్ అంబానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం కుదరదు. కానీ, దానికి ఎస్ బ్యాంకు ముసుగు వేసి అనిల్ అంబానీకి చెందిన రెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారు. వాటి ద్వారా అనిల్ అంబానీ ఇతర కంపెనీలకు సాధారణ అవసరాల కార్పొరేట్ రుణాలు ఇచ్చారు. దరఖాస్తు ఇచ్చిన రోజే వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు ఈడీ గ్రహించింది. దరఖాస్తు, మంజూరు, ఒప్పందం, నిధుల బదిలీ ఒకేరోజు జరిగాయి. కొన్నిసార్లు రుణం మంజూరు కాకముందే నిధుల బదిలీ జరిగిపోయింది.
క్షేత్ర తనిఖీని పూర్తిగా ఎత్తేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్నపుడు గ్రూప్ సంస్థల్లో అవకతవకలు బయటకు వచ్చాయి. 2010-12 మధ్య కాలంలో ఆర్‌కామ్ దేశీయ, విదేశీ సంస్థల నుంచి రూ.40,000 కోట్ల అప్పులను తీసుకుంది. వాటిని తీర్చేక్రమంలో ఎక్కడా డీఫాల్ట్ కాకుండా చూసేందుకు అనిల్ రిలయన్స్ గ్రూపునకు సంబంధించిన కంపెనీల నుంచి రూ.13,600 కోట్లను మళ్లించారు. అందులో 12,600 చెల్లింపులకే ఖర్చు పెట్టారు. ఒక రూ.800 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉంచారు. పలు దఫాలుగా రూ.600 కోట్లను అక్రమ పద్ధతుల్లో విదేశాలకు తరలించారు.
మంచిరేవులలో76 ఎకరాలు కూడా ?
హైదరాబాద్‌లోని మంచిరేవులలో 76.2 ఎకరాలను 2007లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రిలయన్స్ ఇన్‌ఫ్రాకు కేటాయించింది. అప్పట్లో ఈ సంస్థ ఆ భూమి కోసం రూ.517 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. అయితే, కేవలం రూ.250 కోట్లు చెల్లించింది. 2014లో ఇక్కడే వంద అంతస్తుల భవనం కడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన వాటిలో హైదరాబాద్ ఆస్తులు కూడా ఉండటంతో మంచిరేవుల 76.2 ఎకరాల భూములే జప్తు చేసినట్లు భావిస్తున్నారు.
The post Anil Ambani: రూ.7,500 కోట్ల విలువైన అనిల్ అంబానీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Anil Ambani: రూ.7,500 కోట్ల విలువైన అనిల్ అంబానీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
Categories: