విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని… ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో ఉక్కు పరిశ్రమకు రూ.15 వేల కోట్ల సాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించినట్లు తెలిపింది. ఇక ఓవరాల్ కెపాసిటీ యుటిలైజేషన్‌ను 17 నెలల్లో 48 నుంచి 79 శాతానికి పెంచినట్లు సోదాహరణగా వివరించింది. దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాలు ఈ ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల ఒక సర్క్యూలర్ జారీ చేసింది. ఇది కార్మికుల్లో ఆందోళనకు కారణమైనట్లు తెలుస్తోంది. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలు చెల్లిస్తామని ఆ సర్క్యూలర్ లో యాజమాన్యం పేర్కొన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీని వల్ల నష్టపోతామని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(సోమవారం) ఉక్కు కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేది లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విశాఖ ఉక్కు యాజమాన్యం తీసుకొచ్చిన ఆదేశాలతో ప్రస్తుతం ఈ వివాదం రేగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తమందరికీ యాజమాన్యం పూర్తి జీతాలు అందజేసిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
నవంబర్ నుంచి మాత్రం అందుకు భిన్నంగా జీతాలు చెల్లింపు ఉంటుందని యాజమాన్యం చెబుతోందని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాల చెల్లింపులు ఉంటాయని సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంపై వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా 100 శాతం ఉత్పత్తి జరిగితేనే 100 శాతం జీతాలు ఇస్తామని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నారు.
దాని వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు కార్మికులు. ముడి పదార్థాలు సరిగ్గా అందుబాటులో లేవని.. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. దీని వల్ల లక్షిత ఉత్పత్తి సాధించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ముడి సరకు అందుబాటులో ఉండి.. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే.. ఉత్పత్తి సాధ్యమవుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి వేళ.. ప్రభుత్వం విశాఖ ఉక్కుపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్పౌజ్ గ్రౌండ్స్‌పై అంతర్‌జిల్లా బదిలీలకు అనుమతిచ్చింది. బదిలీకి అర్హతలు, మార్గదర్శకాలతో జీవో విడుదల చేసింది. బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బదిలీ దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని ఉద్యోగులను కోరింది. ఉద్యోగి వినతి, అర్హత మేరకు బదిలీలు చేయాలని స్పష్టం చేసింది. నవంబర్ నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తికావాలని, బదిలీల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్‌ను కోరింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
The post AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన
Categories: