hyderabadupdates.com Gallery Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్

Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్

Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్ post thumbnail image

Bhojpuri Singers : బిహార్‌ సంస్కృతి, సంప్రదాయాలకు భోజ్‌పురీ పాటలు (Bhojpuri Singers) పెట్టింది పేరు. అక్కడి ప్రజల్లోనూ వీటికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ‘జానపదం’ తనదైన ముద్ర వేసుకుంటోంది. అనేక మంది పాపులర్‌ గాయనీ గాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలూ వీరిని రంగంలోకి దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Bhojpuri Singers – మైథిలీ నుంచి శిల్పి వరకు
బీజేపీ (BJP) నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకుర్‌ (25) ఇప్పటికే వెల్లడించారు. బీజేపీ సీనియర్‌ నేతలు వినోద్‌ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌లతో భేటీ అనంతరం ఈ యువ గాయని మీడియాతో మాట్లాడారు. ఇది తనకు భిన్నమైన ప్రయాణమని… ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరో ప్రముఖ గాయని శిల్పి రాజ్‌ కూడా కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌తో భేటీ అయ్యారు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన్‌ సురాజ్‌ పార్టీ కూడా భోజ్‌పురీ గాయకుడు రితేష్‌ రంజన్‌ పాండేను కర్గహర్‌ స్థానం అభ్యర్థిగా ప్రకటించింది. తాను ఈ నేలలోనే పుట్టి పెరిగానని, కళాకారుడిగా ఇక్కడ తరచూ పర్యటిస్తుంటానని చెప్పారు. ఎన్నికల్లో స్థానిక ప్రజల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాపులర్‌ భోజ్‌పురీ గాయకుడు అలోక్‌ కుమార్‌ కూడా ఇటీవలే జన్‌ సురాజ్‌ లో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, రాష్ట్రంపై ప్రశాంత్‌ కిశోర్‌ కు ఉన్న దార్శనికత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మాత్రం… ఆలోచిస్తానని చెప్పారు. అంతేకాదు కళాకారులు పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
భోజ్‌పురీ సూపర్‌స్టార్‌ పవన్‌ సింగ్‌… గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి బీజేపీ తరఫున భోజ్‌పుర్‌ జిల్లాలోని ఏదైనా ఒకస్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, రాష్ట్రీయ లోక్‌ మోర్చా (RLM) చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహాలతో భేటీ కావడంతో ఎన్డీయే తరఫున పోటీ ఖాయమని భావించారు. కానీ, ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తాజాగా ఆయన ప్రకటించారు. ఆయన భార్య జ్యోతి సింగ్‌… జన్‌ సురాజ్‌ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ తో భేటీ అయిన మరుసటి రోజే పవన్‌ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఒకే ఒక్క భోజ్‌పురీ గాయకుడు వినయ్‌ బిహారీ. వెస్ట్‌ చంపారన్‌ లోని లౌరియా స్థానానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో భోజ్‌పురీ కళాకారులు ఎంతో రాణిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక మంది జానపద కళాకారులు విజయం సాధిస్తారని గాయకుడు, ప్రస్తుత భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ ఆశాభావం వ్యక్తం చేశారు. జానపద గాయకులు జనంతో మమేకమవుతారని, ప్రజల నాడి వారికి తెలుసని అన్నారు.
Bhojpuri Singers – పోటీపై ఊహాగానాలపై స్పందించిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్
ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ (Pawan Singh) తనపై వస్తున్న ఊహాగానాలను తిప్పికొట్టారు. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తాను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడినని చెప్పుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తానువున్న ఫోటోను షేర్‌ చేసిన పవన్ సింగ్.. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు.
‘నేను, పవన్ సింగ్.. మా భోజ్‌పురి కమ్యూనిటీకి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నేను బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలో చేరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను పార్టీకి నిజమైన సైనికుడిని..అలా సైనికునిగానే ఉంటాను’ అని పవన్ సింగ్ తన ‘ఎక్స్‌’ పోస్టులో తెలిపారు.
భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో బీజేపీ నుంచి మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌ లోని అసన్సోల్ నుండి పోటీకి దిగారు. అయితే తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.
బిహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ !
మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం)… ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్‌లో (Bihar) ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ (BIhar) తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.
నిజానికి 2015 నుంచే బిహార్‌పై (Bihar) మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
బిహార్‌ (Bihar) లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా… ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను… 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే… ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌ తోపాటు… తేజస్వీ యాదవ్‌ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్‌లో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.
Also Read : Ex Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
The post Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడుMinister Rammohan Naidu: మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం – రామ్మోహన్ నాయుడు

    విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అక్కడి నేవీ అధికారుల చేతిలో బందీలు అయిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. డిల్లీలో ఉన్న కేంద్ర పౌర

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

    హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ చోరీపై ‘హైడ్రోజన్‌ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన మోడల్‌ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్‌ కాదు. పేరు లారిస్సా నెరీ. తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్‌ మాథ్యూస్‌ ఫెర్రెరో