బిహార్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. లఖిసరాయ్, సారణ్ వంటిచోట్ల స్వల్ప తోపులాటలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. తొలిదశ పోలింగ్ లో ఓటు వేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, వారి తనయులు తేజస్వీయాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్; ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌధరీ, విజయ్‌కుమార్ సిన్హా, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. బక్సర్, ఫతుహా, సూర్యగఢలలో కొన్ని బూత్‌ల పరిధిలో ఎన్నికలను ఓటర్లు బహిష్కరించారు.
గత మూడు దశాబ్దాల్లో అత్యధిక పోలింగ్ జరిగిందంటే అర్థం నవంబరు 14న ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తున్నట్లే స్పష్టమవుతోందని జన సురాజ్ సంస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. గతసారి ఎన్నికల్లో 57.29% పోలింగే నమోదైంది. 2000లో నమోదైన 62.57% పోలింగే ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజా ఎన్నికల్లో ముజఫ్ఫర్‌పుర్‌లో 70.96%, సమస్తీపుర్‌లో 70.63%, మాధేపురలో 67.21% వైశాలీలో 67.37% పోలింగ్ నమోదైంది. పట్నాలో మాత్రం 57.93% దాటలేదు. మలిదశలో 122 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగాక ఓట్ల లెక్కింపును 14న చేపడతారు. ఎన్నికల దృష్ట్యా భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను ఇరుదేశాలూ కట్టుదిట్టం చేశాయి.
ఇది ప్రజాస్వామ్య విజయం – జ్ఞానేశ్ కుమార్, ప్రధాన ఎన్నికల కమిషనర్
బిహార్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత రికార్డుస్థాయి పోలింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయం. ఎన్నికల యంత్రాంగం పారదర్శకంగా, అంకితభావంతో పనిచేసింది. దేశానికి బిహార్ ఒక దారి చూపింది. ప్రజాస్వామ్యం నెగ్గుతుంది. ఎన్నికల సంఘానికి ఇదొక అపూర్వ ప్రస్థానం.
ట్రైయాంగిల్ ఫైట్ ?
అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పూర్తి స్థాయిలో జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో తిరగడంతో చాలా చోట్ల త్రికోణపు పోటీ ఏర్పడింది. ఈ పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి దిగింది. తేజస్వి యాదవ్ గతంలో తన తల్లి రబ్డీ దేవీని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్‌ను ఎదుర్కొంటున్నారు. సతీష్ ఈసారి జేడీ(యూ) గుర్తుపై పోటీ చేస్తున్నారు. మొత్తం 45,341 పోలింగ్ స్టేషన్లలో అత్యధిక పోలింగ్ స్టేషన్లు (36,733) గ్రామీణ ప్రాం తాల్లోనే ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో దాదాపు 10.72 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్డీఏకు మహాగఠ్‌బంధన్‌కు మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నప్పటికీ ఎన్డీఏలో ఐదు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటిలో జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, జితన్ రాం మాఝీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చా, ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి. మహాగఠ్‌బంధన్‌లోనూ ఆరు పార్టీలు రంగంలో ఉన్నాయి. వీటిలో ఆర్‌జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ (ముఖేష్ సహానీ) ఉన్నాయి.
ఇక ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల కమిషన్ నిర్వహించిన వివాదాస్పద ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) వివాదాస్పదంగా మారింది. బీజేపీని గెలిపించేందుకే ఈ సవరణ చేపట్టారని, లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా అంగీకరించాలని కమిషన్‌ను ఆదేశించడంతో ఈ ఆరోపణలు సద్దుమణిగాయి. అయితే అదే సమయంలో కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర తదితర స్థానాల్లో ఎన్నికల కమిషన్ భారీ అక్రమాలకు తావిచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలింగ్‌కు ఒకరోజు ముందు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఓ బ్రెజీలియన్ మోడల్ లరిస్సా పేరుతో 22సార్లు బోగస్ ఓటింగ్ జరిగిందని ఆధారాలతో బయటపెట్టారు. దాదాపు 25 లక్షల ఓట్లను హరియాణాలో చోరీ చేశారని ఆరోపించారు. ఈ ప్రభావం పోలింగ్‌పై పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం ప్రజాస్వామ్య విజయమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎంకు నిరసన సెగ
బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు నిరసన సెగ తగిలింది. లఖింసిరాయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన పోలింగ్ నేపథ్యంలో తన నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను గురువారం సందర్శించారు. ఓ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు, ఆవు పేడ విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
The post Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్ ! తొలిదశలో 65% ఓటింగ్ ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్ ! తొలిదశలో 65% ఓటింగ్ !
Categories: