BPCL : లంచాలు ఇచ్చి తాను ఎంతగానో విసిగిపోయానని… కుమార్తె మరణించిన బాధలో ఉన్నా ఎవరూ కనికరం చూపలేదని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నెట్టింట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లో సీఎఫ్‌ఓ విధులు నిర్వర్తించినట్లు తన పోస్ట్‌లో పేర్కొన్న ఆయన… లింక్డిన్‌లో ఆ పోస్టు షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
BPCL Ex CFO
బెంగళూరులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) కె.శివకుమార్ కుమార్తె అక్షయ శివకుమార్(34). కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇతర సంస్థల్లో మూడేళ్లు పనిచేశారు. అయితే వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న అక్షయ గతనెల సెప్టెంబర్ 18 మెదడు రక్తస్రావం కారణంగా ఇంట్లోనే మరణించారు. అక్షయ మరణించిన తర్వాత అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. ఆ సమయంలో పలువురు తన వద్ద నుంచి లంచం డిమాండ్ చేశారని, మరికొందరు తనపట్ల దారుణంగా వ్యవహరించారని శివకుమార్ వాపోయారు.
నా కూతురు మరణించిన తర్వాత లాంఛనాలు పూర్తి చేసి, సంబంధిత పత్రాలు పొందేందుకు అంబులెన్స్ ఆపరేటర్లు, పోలీసు అధికారులు, శ్మశానవాటిక సిబ్బంది, స్థానిక యంత్రాంగానికి చెందిన ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని వెల్లడించారు. ‘‘నా బిడ్డ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ.3వేలు వసూలు చేశాడు. ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే… బహిరంగంగానే నగదు డిమాండ్ చేశారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ చనిపోయి నేనుంటే.. అలాంటి తండ్రిపట్ల వారు ఎలాంటి కనికరం చూపలేదు. నా దగ్గర డబ్బు ఉంది. ఇచ్చాను. కానీ పేదవాళ్ల పరిస్థితి ఏంటి..? ఇలా డబ్బు వసూలు చేసినప్పుడు తమకూ ఒక కుటుంబం ఉందన్న ఆలోచన వారికి రాదా..? ఇక నా లంచం బాధ ఇక్కడితో తీరలేదు. మరణ ధ్రువీకరణపత్రం కోసమూ నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది.
రాష్ట్రంలో కుల గణన జరుగుతోందని… సిబ్బంది ఎవరూ లేరని ఐదు రోజుల పాటు తిప్పిపంపారు. అధికారిక రుసుం కంటే ఎక్కువ మొత్తం చెల్లించిన తర్వాత బెంగళూరు మహానగర పాలక సీనియర్ సిబ్బంది దానిని జారీ చేశారు. నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్‌జీ, కిరణ్ మజుందార్ షా వంటి బిలియనీర్లు ఈ నగరాన్ని కాపాడగలరా..?’’ అని ఆ తండ్రి ఉద్వేగానికి గురయ్యారు. అయితే, ఆ తర్వాత తన పోస్ట్‌ను ఆయన తొలగించారు. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ పోస్టు తమ దృష్టి వచ్చిన వెంటనే బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించారు. ఈ కేసులో లంచం ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అనుచిత ప్రవర్తనను పోలీస్ శాఖ సహించదని పేర్కొన్నారు.
Also Read : Kinjarapu Atchannaidu: వైఎస్ జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
The post BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన
Categories: