వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా, కమీషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది.
రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ఆస్తుల జప్తునకు ఆదేశించింది. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్ధరించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలంది. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏసీబీ కోర్టు ముందు లొంగిపోవాలంటూ మద్యం స్కాం నిందితులకు హైకోర్టు ఆదేశం
ఏపీలోని మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌ను బుధవారం ఏపీ హైకోర్టు విచారించింది. అందుకు పాక్షికంగా హైకోర్టు అనుమతించింది. నవంబర్ 26వ తేదీలోగా ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలని వారికి స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకొనేందుకు వారికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఉత్తర్వులతో సంబంధం లేకుండా మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టుకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు ఈ దర్యాప్తులో తెలింది. ఈ స్కాంలో భారీగా అరెస్టులు జరిగాయి. ఈ స్కాంలో భారీగా నగదు పొందిన కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి.. హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కూడబెట్టాడు. వాటిని సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఇక ఈ విచారణలో అతడు వెల్లడించిన అంశాలు ఆధారంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఏ 31గా ధనుంజయ్ రెడ్డి, ఏ 32గా కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఏ 33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
The post Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు
Categories: