అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్ లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్ యాదవ్‌పైనా, తనపైనా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కె.తారకరామారావు చేసిన ఆరోపణలపై చిన్న శ్రీశైలం యాదవ్ స్పందించారు. తాము 48 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని తెలిపారు. నవీన్ యాదవ్ భవిష్యత్ కార్యాచరణ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమేనని, ముఖ్యంగా యువత గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే ఈ విజయమని భావోద్వేగానికి గురయ్యారు.
నా కోసమే ఈ ఎన్నిక వచ్చింది – నవీన్‌యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘ఈ ఎన్నిక నా కోసమే వచ్చింది’ అని ఆయన తొలిసారి చేసిన వ్యాఖ్య ఇది. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించకున్నా తొలి నుంచి తనదే గెలుపు అన్నట్లు ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. ఇదే స్థానం నుంచి గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్.. ఈ ఉప ఎన్నికను తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నట్ల తెలిపారు.
అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన వారినందరినీ పక్కన బెట్టి.. నవీన్ యాదవ్‌కు టికెట్ వచ్చేలా పావులు కదపడంలో సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా అండగా నిలిచారు. ముస్లిం మైనారిటీల ఓట్లు చేజారకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి 2023 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే పోటీ చేసిన అజారుద్దీన్‌ను రేవంత్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ‘గల్లీ పిల్లగాడిని.
మీ వాడిని ఈసారి ఆశీర్వదించండి’ అంటూ వినమ్ర పూర్వక ప్రచారం చేయడంతోపాటు సోషల్ మీడియాను ధీటుగా వాడుకుంటూ యువతను ఆకట్టుకున్నారు. తన తండ్రి శ్రీశైలం యాదవ్ గత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని తనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించకుండా.. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే కాసింత తగ్గి తనకు ఓటేయాలని పదేపదే నవీన్ యాదవ్ అభ్యర్థించారు.
The post Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్ సంచలన కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్ సంచలన కామెంట్స్
Categories: