hyderabadupdates.com Gallery CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు post thumbnail image

 
 
విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తొలి రోజు శుక్రవారం 40 సంస్థలతో రూ.3,49,476 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 4,15,890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సదస్సు ప్రారంభానికి ముందే గురువారం 35 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం… రూ.3,65,304 కోట్ల పెట్టుబడులు రాబట్టింది. దీని ద్వారా 1,26,471 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గురువారం, శుక్రవారం కలిపి 75 ఎంవోయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 5,42,361 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇవి కాకుండా మంత్రి నారా లోకేశ్‌ సహా వివిధ శాఖల మంత్రులు వివిధ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలు ఓపెన్‌ చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలకు సావనీర్‌ గ్యారంటీ ఇస్తామన్నారు. ఎర్త్‌ మినరల్స్‌ నుంచి ఏరో స్పేస్‌ వరకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. ‘ఒప్పందాలు చేసుకుందాం.. భవిష్యత్‌ అవసరాలపై ప్రణాళికలు రూపొందిద్దామని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. కేవలం 17 నెలల వ్యవధిలో రాష్ట్రానికి 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం.. వాటి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు లభిస్తాయన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ గేట్‌వేగా నిలుస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ ఇప్పుడు అగ్రగామిగా ఉందన్న చంద్రబాబు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో ముందుకు వెళ్తున్నామన్నారు.
వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు. డ్రోన్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, స్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఏరో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు.
 
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
 
 
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం వర్చువల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి శంకుస్థాపన జరుపుకోవడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని… డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం మరింత సాయం చేయాలని సీఎం కోరారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేంతలా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, ఇందుకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
క్వాంటం వ్యాలీని జనవరిలో ప్రారంభిస్తున్నామని, అలాగే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరోవైపు డ్రోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి డిమాండ్ విస్తృతంగా ఉందని, దీనిని ముందుగానే ఊహించి డ్రోన్ సిటీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆలోచనను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. ఐటీకి గుర్తింపు లేని సమయంలోనే ఐటీ భవిష్యత్‌ను ఊహించి ఆరోజు అవకాశాలను సీఎం చంద్రబాబు అందిపుచ్చుకున్నారని ప్రశంసించారు. ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటం విషయంలోనూ చంద్రబాబు ముందంజలో ఉన్నారని అన్నారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను నెలకొల్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి కట్టుగా పనిచేస్తున్నారని వెల్లడించారు.
300 ఎకరాల్లో ఓర్వకల్లులో డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రోన్ డిజైన్, తయారీ, సేవలు, ఆర్ అండ్ డీ రంగాల్లో అభివృద్ధి చెందేలా డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. డ్రోన్ సిటీలో అధునాతన తయారీ పార్కులు, టెస్టింగ్ – సర్టిఫికేషన్ సెంటర్ల ఏర్పాటుతో పాటు 25,000 మంది రిమోట్ పైలట్‌లకు శిక్షణ అందిస్తారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు కానున్నాయి. డ్రోన్ సిటీలో 20 శాతం క్యాపిటల్ సబ్సిడీ, 100 శాతం ఎస్జీఎస్టీ రాయితీ వంటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.
దేశంలోనే తొలిసారి ట్విన్ స్పేస్ సిటీస్
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటు అవుతున్నాయి. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ట్విన్ స్పేస్ సిటీస్‌ నిర్మాణం జరగనుంది. ఉపగ్రహ ప్రోటోటైప్ తయారీ, స్పేస్ టెక్ స్టార్టప్‌ ఇంక్యుబేషన్, ఉపగ్రహ విభాగాల తయారీ, లాంచ్ లాజిస్టిక్స్ సపోర్ట్‌కు ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. స్పేస్ సిటీలో 10 ఏళ్లలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 35,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఏపీ స్పేస్ పాలసీ 4.0లో భాగంగా స్పేస్ టెక్ ఫండ్ కింద రూ.100 కోట్ల కేటాయించడం జరిగింది. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల నిర్మాణంతో భారత వైమానిక–అంతరిక్ష రంగాల్లో కొత్త శకం ఆరంభం కానుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి.
The post CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు

Anmol Bishnoi: భారత్ కు గ్యాంగ్‌ స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్Anmol Bishnoi: భారత్ కు గ్యాంగ్‌ స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్

    మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణో య్‌ను అమెరికా నుంచి రప్పిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద ఏప్రిల్‌ 2024లో జరిగిన