కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోరడమంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకొనే ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు వింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి విస్తృత ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుందని మేం ఊహించలేదు అని మరో 20 రోజుల్లో పదవీ విరమణ చేస్తున్న సీజేఐ అన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వాదనలు విని, విచారణను ముగిస్తామని, ఆ తర్వాతే విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలా? వద్దా? అన్న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పిటిషనర్ల న్యాయవాది అరవింద్ డాటర్ వాదనలు వినిపిస్తూ, ఐటాట్, క్యాట్ లాంటి ట్రైబ్యునళ్ల నియామకాలకు సంబంధించి ఎన్నోసార్లు వడపోతలతో ప్రతిభావంతుల జాబితా సిద్ధమైన తర్వాత హఠాత్తుగా జాబితాను పక్కన బెడుతున్నారని, తాజా ఎంపికలకు ఆదేశిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిసార్లు కొత్త ప్రతిభావంతుల జాబితాను తయారు చేయకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారితో నింపేస్తున్నారని వెల్లడించారు. ప్రతిభావంతుల జాబితాలో చేర్చిన తర్వాత చాలామంది బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, అందువల్లే ప్రతిభావంతుల జాబితా విషయంలో స్థిరంగా ఒకే విధానం అవలంబించడం కుదరడంలేదని అటార్నీ జనరల్ వివరించారు. ఇందులో ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం ఏముందని సీజేఐ ప్రశ్నించారు.
తమకు తప్పించుకొనే ఉద్దేశం లేదని, చట్టంలోని లొసుగులను, దానివల్ల జరిగిన కొన్ని తప్పులను ఆధారంగా చేసుకొని మొత్తం చట్టాన్నే కొట్టేయడం సరికాదని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. చట్టాన్ని కొనసాగనిస్తే పిటిషనర్లు లేవనెత్తిన సాంకేతిక లోపాలను కాలక్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. ట్రైబ్యునల్ లో నియామకానికి 50 ఏళ్ల కనీస వయో పరిమితిని పెట్టడాన్ని సీజేఐ తప్పుబట్టారు. తాను 42వ ఏటే హైకోర్టు జడ్జిని అయ్యానని గుర్తు చేసుకున్నారు. హైకోర్టులకు, ట్రైబ్యునళ్లకు ఒకే అర్హత నిబంధనలు సరికాదని, రెండింటికీ భిన్నమైన అనుభవం అవసరమని అటార్నీ జనరల్ బదులిచ్చారు. సీజేఐ తదుపరి వాదనలు ఏడవ తేదీకి వాయిదా వేశారు. ట్రైబ్యునళ్ల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 మధ్యకాలంలో పలు ఆర్డినెన్స్‌లను తెచ్చింది. వాటికి న్యాయస్థానాలు కొట్టేశాయి. దాంతో 2021లో అవే నిబంధనలతో చట్టం చేసింది. ఆర్డినెన్స్‌లోని అంశాలతో రూపొందించిన చట్టం కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని కూడా కొట్టేస్తుందనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే విస్తృత ధర్మాసనం విచారణను కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది.
The post CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం
Categories: