సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీజేఐ హోదాలో తొలి రోజు ఆయన 17 కేసులు విచారించారు. అదే విధంగా ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రపతి భవన్‌లో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. న్యాయస్థానం ప్రాంగణంలోని గాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం ఒకటో నంబర్ కోర్టు రూమ్‌లో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించారు. ఓ ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వెలువరించారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం రెండు గంటల్లో దాదాపు 17 కేసులను విచారించింది.
సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) అధ్యక్షుడు విపిన్ నాయర్ కొత్త సీజేఐని కోర్టురూంలోకి స్వాగతించారు. ఓ న్యాయవాది ఆయన్ను ‘రైతు కుమారుడు సీజేఐ అయ్యారు’ అని పలకరించారు. ఇదిలా ఉండగా.. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ నేడు బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
అధికారిక కారును వదిలి రాష్ట్రపతి భవన్‌ను వీడిన మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ తాను వచ్చిన అధికారిక కారును కొత్త సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలివెళ్లినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీవిరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, సీజేఐకి ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది. అందులోభాగంగానే జస్టిస్ గవాయ్ కారును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. అయితే జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జస్టిస్ గవాయ్ కారును అక్కడే వదిలివేయడం గమనార్హం.
ఈ ఏడాది మే 14వ తేదీన 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బి.ఆర్.గవాయ్ పదవీకాలం ముగియడంతో సోమవారం నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్, కేంద్రమంత్రులు, ఇతరులు పాల్గొన్నారు.
The post CJI Surya Kant: నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ! తొలిరోజు 17 కేసుల విచారణ ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CJI Surya Kant: నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ! తొలిరోజు 17 కేసుల విచారణ !
Categories: