ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో సీఎం సమావేశం అయ్యారు.
పీ4 విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు వివరించారు. రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. శోభా రియాల్టి సంస్థ కూడా ఇందులో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని పీఎన్సీ మీనన్‌ను కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అని వివరించారు. 3 ఏళ్లలో అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతాయని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని వివరించారు. రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలను శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్.. సీఎం చంద్రబాబుకు గుర్తు చేశారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని మీనన్‌ను సీఎం ఆహ్వానించారు.
లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి ప్రణాళికలు – దుబాయ్ పర్యటనలో సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో తన తొలిరోజు పర్యటన ప్రారంభించారు. దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, అబుదాబీలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్‌లతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం అన్నారు. భారతదేశం బ్రాండ్‌ను.. ప్రధాని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ పర్యటించినన్ని దేశాలు మరే ఇతర ప్రధాని పర్యటించలేదని చెప్పారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం – పెట్టుబడులు పెరగడానికి ప్రధాని కృషే కారణమని కొనియాడారు. దుబాయ్ సహా యూఏఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పెట్రో కెమికల్స్, పోర్టులు, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ పార్కులు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లు, ఆతిథ్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 1054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడించారు.
ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందని సీఎం వెల్లడించారు. యూఏఈలో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపై భేటీలో చర్చ జరిగింది. ఆయా దేశాల్లో ఉన్న 4.08 లక్షల మంది తెలుగు ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఎంబసీ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post CM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం
Categories: