ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి.. అనంతరం టపాసులు పేలుస్తూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
‘పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా, సంబరంగా చేసుకుంటారు. ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. చీకట్లను తరిమేసి వెలుగులు పంచే దీపావళి పండుగను ఉండవల్లి నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని.. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించాను. రాష్ట్రాన్ని ప్రగతి వెలుగులతో నింపేందుకు చేస్తున్న ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు, ప్రజల సహకారం కోరుకుంటూ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెనాలి జనసేన కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ దీపావళి వేడుకలు
గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కూటమి పార్టీల నేతలతో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి మంత్రి మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూడు పార్టీల నాయకులతో కలిసి బాణసంచా కాలుస్తూ సందడిగా గడిపారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. దీపావళి పండుగను కూటమి నాయకులతో కలిసి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుందని చెప్పారు.
The post CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు
Categories: