మొంథా తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశామని చెప్పారు. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి.. ప్రత్యేక అధికారులను నియమించామని వివరించారు. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే వర్షం తీవ్రత, తుపాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి మొంథా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాన్ కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను ఇప్పటికే ప్రభుత్వం నియమించింది.
ఇక అక్టోబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాన్ కారణంగా ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా.. సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. మూడు రోజుల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తీర ప్రాంత ప్రజలను ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. కార్తీక మాసం నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ తుపాన్ ప్రభావం కారణంగా.. సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉంటుంది. దాంతో ప్రమాదం పొంచి ఉందని.. సముద్ర స్నానాలు చేయవద్దని ప్రజలకు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
కోస్తా జిల్లాలపై మొంథా తుపాను ఎఫెక్ట్ – హోం మంత్రి అనిత
మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. దీనిపై గత నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారన్నారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తతపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 100కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
భారీ హోర్డింగ్‌లను ముందుగానే తొలగిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాధ్యమైనంత వరకు ఆస్తినష్టం తగ్గించే విధంగా చూస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ తుపాను సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 6 ఎన్డీఆర్‌ఎఫ్, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోస్తా జిల్లాలన్నింటిపైనా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, కాకినాడ పరిధిలోని 6 మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అధికారులంతా అందుబాటులో ఉండాలి – అనగాని
మొంథా తుపాను దృష్ట్యా రెవెన్యూ అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. తుపాను నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆర్ మహేశ్‌కుమార్ వెల్లడించారు. జిల్లాలో 90 కి.మీ పరిధిలో సముద్రతీర ప్రాంతం ఉందని ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక వాచ్‌పాయింట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నామన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.
అప్రమత్తమైన కాకినాడ యంత్రాంగం
మరోవైపు దూసుకొస్తున్న మొంథా తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో తీర ప్రాంత గ్రామాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో స్థానికులతో అధికారులు సమావేశం నిర్వహించారు. కాకినాడ ఆర్టీవో మధుబాబు, పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పీడీ చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని కోరారు. మండలంలో 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తీర ప్రాంత వాసులను ఆయా పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డీవో మల్లిబాబు అధికారులతో చర్చించారు.
The post CM Chandrababu: మొంథా తుపాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తం – సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Chandrababu: మొంథా తుపాన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తం – సీఎం చంద్రబాబు
Categories: