అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లిలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) ముఖ్యమంత్రి ప్రసంగించారు.
తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సీఎం తెలిపారు. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారత దేశంలోనే నూతన నగరంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం అన్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుంది” అని అన్నారు.
హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఆహ్వానించారు. భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని… హైదరాబాదులో ఆ ట్రెండ్ ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సీఎం అన్నారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణరైజింగ్ 2047 విజన్ ను ప్రదర్శించారు.
తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి లక్ష్యం ఢిల్లీలో జరిగిన US-India Strategic Partnership Forum (USISPF) వార్షిక సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరించిన సీఎం ప్రసంగం, అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది.
The post CM Revanth Reddy: ప్రపంచ పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం హైదరాబాద్ – సీఎం రేవంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CM Revanth Reddy: ప్రపంచ పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం హైదరాబాద్ – సీఎం రేవంత్
Categories: