సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ఆశిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘నవంబర్ 22 విశిష్టత గురించి సీఎం చెప్పగానే వస్తానని చెప్పా. ఇప్పటికే దేశంలో ముగ్గురు ప్రముఖులు పుట్టపర్తిని సందర్శించారు. సత్యసాయి విద్యాసంస్థ స్నాతకోత్సవంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. సమాజ సేవ కోసం సత్యసాయిబాబా నాయకులను తయారు చేశారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ ఆహ్వానించగానే అందరూ స్వాగతించారు. విద్యార్థులు దేశ నాయకులుగా ఎదుగుతారనేందుకు ఇదే నిదర్శనం. జీవితంలో ప్రతి రోజూ చాలా కీలకం. మానవ జీవితాలు యాంత్రికంగా, ఆధ్యాత్మికంగా సాగుతున్నాయి. విద్యాసంస్థ ద్వారా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నేర్పుతున్నారు. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యాసంస్థ విలసిల్లుతోంది’’ అని ఉప రాష్ట్రపతి అన్నారు.
సత్యసాయి వర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు – చంద్రబాబు
వ్యక్తిత్వ కేంద్రంగా సత్యసాయి వర్సిటీ నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘సత్యసాయి వర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యేక ఆశయంతో సత్యసాయిబాబా భూమిపైకి వచ్చారు. సత్యసాయి.. భగవాన్ సాయి సిద్ధాంతం వ్యాప్తి చేశారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం కలిగి ఉండాలని చెప్పారు. భారత్.. వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక భావనలతో వర్ధిల్లుతోంది. వసుదైక కుటుంబం.. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేది మన సంస్కృతిలో ఉంది. సత్యసాయి విద్యాసంస్థ నైతికత, విలువలతో కూడి ఉంటుంది. విద్యార్థులకు ఆధ్యాత్మికత, సేవాభావాన్ని విద్యాసంస్థ నేర్పిస్తుంది. అందరినీ ప్రేమించాలి.. సేవ చేయాలి అనేది భగవాన్ సాయి సిద్ధాంతం. సహాయ గుణం కలిగి ఉండాలే కానీ, ఎవరినీ నొప్పించవద్దనేది సిద్ధాంతం. సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలు చెప్పారు’’ అని సీఎం అన్నారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
సాయి స్ఫూర్తిని, బోధనలను ప్రపంచమంతా పరిచయం చేయాలి – సీఎం చంద్రబాబు
విలువల ఆధారంగా, వ్యక్తిత్వ నిర్మాణమే కేంద్రంగా ఉన్న శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి హాజరైనందుకు గౌరవంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టభద్రులవుతున్న గ్రాడ్యుయేట్లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా శాఖ మంత్రి లోకేష్ సహ వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘భగవాన్ బాబా విశిష్టమైన విద్యా విధానానికి ఇక్కడున్న విద్యార్థులంతా ప్రతిరూపాలు. ఈ విద్యా విధానం విద్యార్థులను వృత్తిపరంగా సమర్థులుగా, సామాజిక బాధ్యత కలిగినవారిగా, ఆధ్యాత్మిక స్పృహ కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సత్యసాయి ఒక ఉద్దేశ్యంతో ఈ లోకానికి వచ్చారు. ఒక ఉద్దేశ్యం కోసమే జీవించారు. మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారు’ అని సీఎం అన్నారు.
‘ఇప్పుడు పట్టభధ్రులు అయిన వారంతా నిస్వార్థ సేవ, కరుణ నిజాయితీ అనే విలువలను ఆచరించాలి. భారతదేశం వేల సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది. 1990ల మధ్యలో సాంకేతిక పురోగతి ప్రారంభమైంది. ఇది హైదరాబాద్‌తో సహా అనేక నగరాలను ప్రపంచ ఐటీ హబ్‌లుగా మార్చింది. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.
‘ఈ రోజు భారతదేశానికి అధిక జనాభా వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇది మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉంది. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకుని మన దేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగింది. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నాం. విద్యార్థులు, యువత దేశానికి సంరక్షకులు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా, విలువలతో ముందుకు వెళ్లాలి’ అని పిలుపునిచ్చారు.
‘సాయి సిద్ధాంతాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. సాయి బాబా స్పూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యపీ సొసైటీని రూపొందించడానికి కృషి చేయాలి. కోయంబత్తూరు గాంధీగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు పేరుంది. నిత్యం ప్రజలకు సేవ చేయాలని తపన పడుతూ ఉంటారు. ప్రస్తుతం సత్యసాయి జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో సహా రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారంతా వచ్చారు. సత్యసాయి బాబా గొప్పదనం ఇది. పుట్టపర్తి అనేది సత్యసాయి బాబా ప్రవిత్ర భూమి’ అని అన్నారు.
The post CP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్ – ఉప రాష్ట్రపతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CP Radhakrishnan: సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి అగ్రస్థానానికి భారత్ – ఉప రాష్ట్రపతి
Categories: