చాదర్‌ఘాట్ (Chaderghat) విక్టోరియా గ్రౌండ్లో మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఇందుకు గల కారణాలను పోలీసు అధికారులని అడిగి సజ్జనార్ తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారని చెప్పుకొచ్చారు.
శనివారం సాయంత్రం 5 గంటలకు చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఈ ఘటన జరిగిందని వివరించారు. రౌడీ షీటర్, మొబైల్స్ స్నాచర్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీపై 20కి పైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఉమర్‌పై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ అయిందని పేర్కొన్నారు. నిందితుడిపై రెండు పీడీ యాక్ట్‌లు నమోదు అయ్యాయని.. రెండు సంవత్సరాలు మహ్మద్ ఉమర్ అన్సారీ జైల్లో కూడా ఉన్నారని తెలిపారు సజ్జనార్.
దొంగను ఛేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ, తన సిబ్బందితో వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో డీసీపీ గన్‌మెన్‌పై దొంగ కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. వెంటనే డీసీపీ చైతన్య అప్రమత్తమై రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారని తెలిపారు. దొంగకు చేతిపై.. కడుపులో గాయాలయ్యాయని వివరించారు. దొంగని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు సజ్జనార్.
ఈ ఘటనలో డీసీపీ చైతన్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. గాయలైన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేస్తామని ఉద్ఘాటించారు. మహ్మద్ ఉమర్ అన్సారీపై ఉన్న కేసులు, నేరాలు, అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని పేర్కొన్నారు. రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతామని వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
The post CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్
Categories: