CP Sajjanar : వ్యూస్ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (CP Sajjanar) ప్రశ్నించారు. వ్యూస్, లైక్స్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో సజ్జనార్ (CP Sajjanar) పోస్ట్ పెట్టారు.
‘‘చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? చిన్నారులు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయండి. అంతేకానీ.. ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించవద్దు. గుర్తు పెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాదు.. చట్టరీత్యా నేరం. ఇటువంటి చర్యలు పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం వారిని వేధించడం కిందికే వస్తుంది.
CP Sajjanar – అలాంటి వీడియోలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి
మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ అప్‌లోడ్ చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్టు చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్‌లైన్ నంబర్ 1930కి గానీ.. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయండి. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యం, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం కూడా మీ బాధ్యతే అనే విషయం మరిచిపోవద్దు’’ అని సజ్జనార్ (CP Sajjanar) పేర్కొన్నారు.
సజ్జనార్ ఎఫెక్ట్.. ఆ చిల్లర ఇంటర్వ్యూలు డిలీట్ !
ఇటీవల ఓ మైనర్ జంట ఇంటర్వ్యూ సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఓ షార్ట్‌ఫిల్మ్/ఆల్బమ్ చేసిన జంట అందులో ముద్దు సీన్ చేయడంపై యాంకర్ ప్రశ్నిస్తాడు. అయితే ఆ బాలిక దాంట్లో ఏముంది? ఇప్పుడు కూడా పెట్టేస్తా… అంటూ ఇంటర్వ్యూలో బరితెగించి ఓవరాక్షన్‌కు దిగింది. ఈ పరిణామంతో యాంకర్ షాక్ కావడం.. మీమ్స్, ఫన్నీ ఎడిట్ వీడియోల రూపంలోనూ వైరల్ అయ్యింది. అయితే ఈ తరహా ఇంటర్వ్యూలు, వీడియోల వ్యవహారంపై నగర పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ కన్నెర్ర చేశారు.
మైనర్ల అభ్యంతరకరమైన వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియాల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వ్యూలను అధ్యయనం చేస్తూ పోక్సోతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సజ్జనార్ హెచ్చరికల నేపథ్యంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లపై సిటీ పోలీసుల నజర్ పెరిగింది. మైనర్లతో అభ్యంతరకర వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వీడియోలను చేసేవాళ్లనే కాదు, అప్‌లోడ్ చేస్తున్నవాళ్లను, మీమ్స్ పేరిట పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నవాళ్లను కూడా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు.
Also Read : Supreme Court: లాయర్ రాకేష్ కిషోర్ పై సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
The post CP Sajjanar: వ్యూస్ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CP Sajjanar: వ్యూస్ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్
Categories: