Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె… దాదాపు 30 నిమిషాల్లో 200 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారు. దీనితో వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము (Droupadi Murmu) చరిత్ర సృష్టించారు. 2023 ఏప్రిల్‌లో ఆమె అస్సాంలోని తేజ్‌పుర్ నుంచి సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో గగన విహారం చేసిన సంగతి తెలిసిందే. 2006 జూన్‌లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, 2009 నవంబరులో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభాపాటిల్ సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల్లో ప్రయాణించారు.
Droupadi Murmu – జీ సూట్‌లో.. సన్ గ్లాసెస్‌తో.. రాష్ట్రపతి
త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన ముర్ము (Droupadi Murmu)… రఫేల్‌లో విహరించడానికి ముందు అంబాలాలో గౌరవ వందనం స్వీకరించారు. జీ సూట్‌లో, సన్ గ్లాసెస్ ధరించి, చేతిలో హెల్మెట్ పట్టుకుని పైలట్‌తో ఫొటోలు దిగారు. మన దేశంలో రఫేల్ యుద్ధ విమాన తొలి మహిళా పైలట్‌గా ఖ్యాతికెక్కిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్ కూడా రాష్ట్రపతితో ఫొటోలకు పోజిచ్చారు. ముర్ము ప్రయాణించిన యుద్ధ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ నడిపారు. ఉదయం 11:27 నిమిషాలకు అది టేకాఫ్ అయింది. ప్రయాణంలో సముద్ర మట్టం నుంచి 15 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకుంది. దాదాపు గంటకు 700 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లింది. రఫేల్‌లో రాష్ట్రపతి విహారాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ అంబాలా స్థావరం నుంచే మరో విమానంలో ప్రయాణించారు.
మర్చిపోలేని గొప్ప అనుభవం – రాష్ట్రపతి
ఈ చారిత్రక పర్యటన అనంతరం రాష్ట్రపతి ముర్ము సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని పంచుకున్నారు. ‘రఫేల్ యుద్ధ విమానంలో నా తొలి ప్రయాణం కోసం అంబాలా ఎయిర్‌బేస్‌ను సందర్శించడం ఆనందంగా ఉంది. ఇది నాకు మర్చిపో లేని గొప్ప అనుభవం. దేశ రక్షణ సామర్థ్యాలపై తన విశ్వాసాన్ని ఈ విహారం మరింతగా ఇనుమడింపజేసిందన్నారు. శక్తివంతమైన రఫేల్‌లో ఈ ప్రయాణం దేశ రక్షణ సామర్థ్యాలపై నాకు కొత్త నమ్మకాన్ని, గర్వాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత వైమానిక దళాన్ని, అంబాలా ఎయిర్‌బేస్ బృందాన్ని అభినందిస్తున్నాను’’ అని పుస్తకంలో రాష్ట్రపతి రాశారు. ఈ ఏడాది మేలో ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై రఫేల్ జెట్లతో భారత్ దాడులు జరిపింది. ఈ యుద్ధ విమానంలో ప్రస్తుతం రాష్ట్రపతి గగన విహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : APEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టం
The post Droupadi Murmu: రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Droupadi Murmu: రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి
Categories: