Election Commission : తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనానికి ఈసీ (Election Commission) ఈ విషయాన్ని తెలిపింది. కరూర్ లో విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దు చేయడంతోపాటు రాజకీయ పార్టీల ప్రచార సభల్లో మహిళలు, చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని సీజే జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మరుగణ్‌ల ధర్మాసనం విచారించింది.
ఈ ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టులో (Supreme Court) పెండింగులో ఉన్న పిటిషన్లు మినహా ఈ కేసుల విచారణకు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటన్నింటిని హైకోర్టు పాలనావ్యవహారాల విభాగం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇక టీవీకే గుర్తింపు రద్దు విషయానికొస్తే… ఇప్పటికీ ఆ పార్టీకి ఆ హోదా లేనందున ఆ అభ్యర్థన నిలబడదని ఈసీ తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ పేర్కొన్నారు.
Election Commission – కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు
కరూర్‌లో టీవీకే ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టింది. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం రాత్రి కరూర్ కు చేరుకుంది. ఏఎస్పీ ముఖేశ్ కుమార్, డీఎస్పీ రామకృష్ణన్ సహా మొత్తం ఆరుగురు సభ్యుల బృందం శుక్రవారం దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని టూరిజం గెస్ట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకొని సీబీఐ బృందం (CBI) దర్యాప్తు చేస్తోంది. అంతకుముందు ఈ ఘటనపై ‘సిట్’ దర్యాప్తు చేయగా.. అందుకు సంబంధించిన అన్ని దస్త్రాలు సీబీఐ బృందానికి అప్పగించింది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్న అధికారులు రానున్న రోజుల్లో తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. వీటితోపాటు బాధిత కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులతోపాటు స్థానికుల నుంచి వాంగ్మూలాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు తొలుత సిట్ చేపట్టింది. దీనిని సవాల్ చేస్తూ… టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకంలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. విచారించిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతను సీబీఐకి మారుస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read : Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్’
The post Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ
Categories: