Ex MLC Kavitha : జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Ex MLC Kavitha) అన్నారు. హైదరాబాద్ లో యాత్ర పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. పోస్టర్ పై తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫొటో వాడటం సరికాదని భావించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుందనే అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. వారికన్నీ తెలుసని చెప్పారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామన్నారు.
ఈ సందర్భంగా బుధవారం నాడు యాత్రపై మీడియాతో కవిత (Ex MLC Kavitha) మీట్లాడుతూ… నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని.. ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటామన్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలను ప్రజల నుండే తెలుసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు విధానమని వివరించారు. తాము ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులన్నారు. పెద్ద పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారని గుర్తుచేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటామని కవిత అన్నారు.
Ex MLC Kavitha – కేసీఆర్ ఫోటో వాడటం కరెక్ట్ కాదు – కవిత
కేసీఆర్ (KCR) ఫోటో లేకుండానే యాత్ర చేస్తామన్నారు కవిత (Ex MLC Kavitha). కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని… అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాగృతి పెట్టినప్పుడు జయశంకర్ ఫోటో పెట్టామన్నారు. కేసీఆర్‌కు పుట్టడం తన అదృష్టమని… ‘మా దారులు వేరే అయినప్పుడు నా లైన్ నేను తీసుకోవడం కరెక్ట్’ అని అన్నారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని… ఆ పార్టీ నుండి తనను సస్పెండ్ చేశారని తెలిపారు. నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్లు వెల్లడించారు. దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుట్రతో బయటకు పంపారు – కవిత
జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని… కేసీఆర్ (KCR) నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పార్టీతో జాగృతి అనుసంధానంగా పని చేసిందని వివరించారు. తన సస్పెన్షన్‌కు కారణాలను విశ్లేషించుకున్నానని తెలిపారు. పేగులు తెగేదాక తెలంగాణ కోసం కోట్లాడానని అన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని.. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా అని ప్రశ్నించారు. ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని మండిపడ్డారు.
ప్రభుత్వంపై విమర్శలు
ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం లేదన్నారు. అనేక సమస్యలు తెలంగాణను పట్టి పీడిస్తున్నాయన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా తేలేకపోతున్నారని విమర్శించారు. పది సంవత్సరాల్లో తెచ్చిన ఫలితాలు ఇప్పుడు అందడం లేదని కవిత వ్యాఖ్యలు చేశారు.
రాజీనామాపై కవిత ఆశక్తికర వ్యాఖ్యలు
‘పార్టీ వద్దనుకున్నాక పదవి ఎందుకు. చాలా క్లారిటీతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమోదించడం లేదు. రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ రాజకీయం ఏంటో ? పార్టీ పెట్టాలో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ప్రజలే గురువులు. కాబట్టి ఏం చేయాలో వారినే అడుగుతా. కేసీఆర్‌కు మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నం చేశాను. కానీ నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దారులు వేసినప్పుడు ధైర్యం ఉండాలి. బనకచర్ల, గోదావరి జలాలు లాంటి అన్ని అంశాలను మాట్లాడుతాం. యూరియా నుండి బస్సుల దాకా అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ చిన్న విషయం. ఉపఎన్నికతో జాగృతికి సంబంధం లేదు’ అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Also Read : CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల
The post Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత
Categories: