hyderabadupdates.com Gallery Faridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

Faridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

Faridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర post thumbnail image

 
 
దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఫరీదాబాద్‌ ఉగ్రవాద ముఠా ప్రణాళిక సిద్ధం చే సినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు గుర్తించారు. ఏకంగా 32 కార్లలో బాంబులు అమర్చి, 8 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు చేయాలని ఈ మాడ్యూల్‌ కుట్ర పన్నింది. ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లను లక్ష్యంగా ఎంచుకున్నారు. వీరి కుట్రకు హరియాణాలోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ వేదిక అయ్యింది. ముఖ్యంగా యూనివర్సిటీ క్యాంప్‌సలోని 17 భవనంలో ఉన్న బాయ్స్‌ హాస్టల్‌లోని 13వ నంబర్‌ గదిని ఉగ్ర స్థావరంగా మార్చుకున్నట్లు గుర్తించారు.
ఈ ఉగ్రవాద వైద్యులు టర్కీలోని ఉకాసా అనే వ్యక్తితో తరుచూ సంభాషించారు. ఆ ఉకాసా ఎవరన్నదానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. హ్యాండ్లర్‌తోపాటు ఈ ముఠా సభ్యులు పరస్పరం సంభాషించుకునేందుకు స్విట్జర్లాండ్‌కు చెంది న త్రీమా యాప్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. కాగా, సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య13కు చేరిం ది. ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో గురువారం ఒకరు మరణించాడు.
బాంబుల కోసం 26 క్వింటాళ్ల ఎరువు కొనుగోలు
ఫరీదాబాద్‌ ఉగ్రవాదులు మహా విధ్వంసానికే కుట్ర పన్నారు. 8 మంది నాలుగు గ్రూపులుగా విడిపోయి, ఏక కాలంలో 32 కార్లలో బాంబులు అమర్చి పేల్చివేయాలని ప్రణాళిక వేశారు. అందుకోసం మొత్తం పాత కార్లనే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నాలుగు కార్లను సమకూర్చుకున్నారు. ఎర్రకోట వద్ద పేలింది అందులో ఒకటే. ఎరుపు రంగు ఎకోస్పోర్ట్‌ కారును బుధవారం హరియాణాలోని ఓ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. అందులో నిద్రిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముజమ్మిల్‌ వాడిన బ్రెజా (హెచ్‌ఆర్‌87 యూ9988) కారును యూనివర్సిటీ క్యాంప్‌సలోకనుగొన్నారు.
డాక్టర్‌ షహీన్‌ సయీద్‌ వాడిన స్విఫ్ట్‌ డిజైర్‌ కారును గతంలోనే స్వాధీనం చేసుకోగా, అందులో ఓ అసాల్ట్‌ రైఫిల్‌ లభించింది. ఈ కార్లలో అమర్చేందుకు ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజెస్‌ (ఐఈడీ) బాంబులను తయారు చేసేందుకు రూ.3 లక్షలతో గురుగ్రామ్‌, నూహ్‌ తదితర చోట్ల నుంచి 26 క్వింటాళ్ల ఎన్‌పీకే ఎరువులను కొనుగోలు చేసినట్లు తేలింది. బాంబుల తయారీ, దాడుల కోసం డాక్టర్‌ ముజమ్మిల్‌, డాక్టర్‌ అదీల్‌, డాక్టర్‌ షహీన్‌ సయీద్‌, డాక్టర్‌ ఉమర్‌ నబీ కలిసి రూ.20 లక్షలు సేకరించి, ఆ డబ్బును నబీ వద్ద దాచినట్లు గుర్తించారు. ఎర్రకోట బాంబు దాడిలో అతడు కూడా మర ణించిన విషయం తెలిసిందే. ఈ డబ్బు విషయంలో ముజమ్మిల్‌, ఉమర్‌ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్లు కూడా అధికారుల విచారణలో తేలింది. అరెస్టయిన డాక్టర్లంతా ఆత్మాహుతి బాంబర్లుగా మారాలని నిర్ణయించుకున్నట్లు గుర్తించారు.
 
అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఎన్ఐఏ
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పోస్టర్లు వేసి దొరికిపోయిన ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌ వెనుక అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ ఉన్నట్లు భారత దర్యాప్తు, నిఘా వర్గాలు గుర్తించాయి. మొదట ఈ మాడ్యూల్‌ను తేలిగ్గా తీసుకున్న పోలీసులు… ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడి తర్వాత లోతుగా శోధిస్తుండటంతో నిఘా వర్గాలే ఉలిక్కిపడే కుట్ర బయటపడుతోంది. టర్కీలో తిష్ట వేసిన పాకిస్థాన్‌ జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ నాయకులు… అక్కడి నుంచి ఫరీదాబాద్‌ మాడ్యూల్‌ను నడిపించినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఉకాసా అనే పేరుతో ఉన్న వ్యక్తి ఈ మాడ్యూల్‌కు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినట్లు తేలింది. అరబ్బీలో ఉకాసా అంటే సాలీడు అని అర్థం. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీతోపాటు ఈ వైద్యుల ముఠాను తయారుచేసిన జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ గతంలో టర్కీలో రెండువారాలు ఉండి వచ్చినట్లు గుర్తించారు. వారు ఉకాసాను కలిసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఉగ్రడెన్‌ గా రూమ్‌ నంబర్‌ 13
హరియాణాలోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వర్సిటీని ఉగ్రవాదులు తమ డెన్‌గా మార్చుకున్నట్లు తేలింది. ముఖ్యంగా 17వ భవనంలో ఉన్న బాయ్స్‌ హాస్టల్‌ లో 13వ నంబర్‌ గది ఉగ్ర స్థావరంగా మారింది. పోలీసులు అరెస్టు చేసిన డాక్టర్‌ ముజమ్మిల్‌ ఆ గదిలో ఉండేవాడని గుర్తించారు. ఈ ఉగ్రముఠా మొత్తం ఈ గదిలోనే తరచూ సమావేశమై దాడులకు ప్రణాళిక రూపొందించినట్లు తేలింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ నబీ ఇదే హాస్టల్‌లో 4వ నంబర్‌ గదిలో ఉండేవాడని, ఆ గదిలో కూడా ఈ ఉగ్ర డాక్టర్లు సమావేశం అయ్యేవారని పోలీసులు తెలిపారు. క్యాంపస్ లో ఇంకా ఎవరెవరు ఈ ముఠాలో సభ్యులుగా చేరారన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన మహిళా ఉగ్రవాది, అల్‌ ఫలాహ్‌ వర్సిటీ మెడికల్‌ కాలేజీ డాక్టర్‌ షహీన్‌కు పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైంది.
అల్‌ ఫలాహ్‌ వర్సిటీ స్థాపకుడి అక్రమాలెన్నో
దేశవ్యాప్తంగా భారీగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్ర వైద్యులకు అడ్డాగా మారిన అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్‌ అహ్మద్‌ సిద్ధిఖి అక్రమాలు బయటికి వస్తున్నాయి. భారీగా లాభాలు వస్తాయంటూ రూ.7.5 కోట్లు డిపాజిట్లు సేకరించి, మోసం చేసిన కేసులో ఆయన మూడేళ్లు జైలుకు వెళ్లిన అంశం చర్చనీయాంశంగా మారింది. అల్‌ ఫలాహ్‌ ఇన్వెస్ట్ మెంట్‌ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి.. ఆ సొమ్మును వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారు సిద్దిఖీ. దీనిపై నమోదైన కేసులో 2001 మార్చిలో అతడు అరెస్టయ్యారు. బాధితులకు సొమ్ము తిరిగిస్తానని ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇవ్వడంతో 2004 ఫిబ్రవరిలో బెయిల్‌పై విడుదలయ్యారు.
 
డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా అంబేద్కర్‌ నగర్‌కు చెందిన సిద్ధిఖి.. అల్‌ ఫలాహ్‌ చారిటబుల్‌ ట్రస్టు కింద తొమ్మిది సంస్థలను స్థాపించారు. ఇవన్నీ కూడా ఢిల్లీలోని జామియా నగర్‌లో అల్‌ ఫలాహ్‌ హౌజ్‌ పేరిట ఉన్న ఒకే భవనం చిరునామాతో రిజిస్టర్‌ చేశారు. ఇందులో యూనివర్సిటీ తప్ప మిగతా సంస్థలన్నీ 2019 ఏడాది వరకే కొనసాగాయి. తర్వాత కొన్నింటిని మూసేయగా, మరికొన్నింటిని పక్కనపెట్టేశారు. ఇదిలా ఉండగా, అల్‌ ఫలాహ్‌ ప్రైవేటు యూనివర్సిటీకి ‘న్యాక్‌ (జాతీయ మదింపు, గుర్తింపు మండలి)’ నోటీసులు జారీ చేసింది. వర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్‌, ఉపాధ్యాయ విద్య కాలేజీలకు న్యాక్‌ నుంచి ఎలాంటి గుర్తింపు లేకున్నా.. న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ గుర్తింపు ఉన్నట్టుగా వెబ్‌సైట్లో పేర్కొన్నారని వెల్లడించింది.
 
The post Faridabad Terror Module: 32 కార్లు, 8 మానవ బాంబులతో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక రెండే పార్టీల మధ్య జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టి, పేదవాడి గూడు కూలగొట్టి, వాళ్ల నడుం విరగ్గొట్టి ఉపాధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌కు… పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లా

CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుCM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

    ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. వాయుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు

YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గురువారం పర్యటించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ సందర్శన కోసం రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్‌ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా