డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాణసంచా పరిశ్రమ యజమాని సత్తిబాబు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో పలువురు చనిపోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలు, వైద్యసాయంపై వివరాలను అధికారుల నుంచి ఆయన తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆమె మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు.
కోనసీమ ప్రమాదంలో ప్రాణనష్టం బాధాకరం – ప్రధాని మోదీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం చోటుచేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలియజేశారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం
ప్రమాద ఘటన ఆవేదన కలిగించిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుందన్నారు. ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు ఆరా తీసినట్లు చెప్పారు. దీపావళి సమయంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో, సంబంధిత గోదాముల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి – మంత్రి లోకేష్
కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు సజీవ దహనం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీసిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
The post Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !
Categories: