మయన్మార్‌లో స్కామ్ సెంటర్ నుంచి పరారై సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్ పట్టణం మే సొట్‌లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకువచ్చింది. మయన్మార్‌లోని మ్యావద్డీ నగరంలోని కేకే పార్క్‌లో ఉన్న సైబర్‌క్రైం హబ్‌పై అక్కడి అధికారులు దాడులు జరిపి అక్కడున్న సిబ్బందిని విడిపించారు.
ఇందులో సుమారు 500 మంది భారతీయులు సహా 28 దేశాలకు చెందిన మొత్తం 1,500 మంది ఉన్నారు. అంతా కలిసి సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్ పట్టణం మే సొట్‌కు చేరుకున్నారు. అక్రమంగా ప్రవేశించిన ఆరోపణలపై అక్కడి అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. సైబర్ మోసాల్లో భాగస్వాములుగా మారిన వీరిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు థాయ్‌ల్యాండ్, మయన్మార్‌లలోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాయి.
ఈ చర్చలు సఫలం కావడంతో వైమానిక దళానికి చెందిన రెండు విమానాల్లో మొదటి విడతలో 26 మంది మహిళలు సహా 270 మంది ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో అక్కడ బాధితులుగా మారిన వారు, నేరాల్లో పాలుపంచుకున్న వారు ఉన్నారు. అధికారులు వీరిని ప్రశ్నించే అవకాశముంది. విదేశీ ఏజెంట్ల వలలో ఎలా పడ్డారు? అక్కడ ఎలాంటి విధులు నిర్వహించారు? వంటి వివరాలను తెలుసుకుంటారు. మయన్మార్‌లో స్కామ్ సెంటర్‌లు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, థాయ్‌ల్యాండ్‌లో ఉన్న మిగతా వారి కోసం మరిన్ని విమానాలను పంపుతామని అధికారులు తెలిపారు.
భారత్ – దక్షిణాఫ్రికా నౌకపై సొమాలియా పైరేట్ల దాడి
సొమాలియా పైరెట్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నౌకపై సొమాలియా తీరానికి సమీపంలో దాడికి దిగారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో నౌకపై కాల్పులకు దిగారు. మాల్టాకు చెందిన ఈ నౌక గుజరాత్‌లోని సిక్కా ఓడరేవు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలోని డర్బన్ వైపు వెళ్తోందని ఆంబ్రే అనే ప్రైవేట్ భద్రతా సంస్థ తెలిపింది. నౌకలో ప్రత్యేకంగా భద్రత సిబ్బంది లేరని పేర్కొంది. అందులోని మొత్తం 24 మంది సిబ్బంది ఓడలోని ఓ గదిలో లోపలి నుంచి తాళం వేసుకుని ఉండిపోయారంది. దాడి నేపథ్యంలో నౌక మార్గం మార్చుకుని, వేగం తగ్గించుకుందని వివరించింది. సముద్రం దొంగల దాడి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ మిలటరీలోని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల ఇరాన్‌కు చెందిన మత్స్యకార పడవను అడ్డగించి, స్వాదీనం చేసుకున్న పైరేట్లు దాడులకు పాల్పడుతున్నారంది. తాజాగా కేమెన్ దీవులకు చెందిన నౌకపై పైరేట్లు కాల్పులకు తెగబడ్డారని, ఓడలోని భద్రతా సిబ్బంది ప్రతిదాడికి దిగడంతో వారు తోకముడిచారని పేర్కొంది. సొమాలీ తీరంలో 2011లో అత్యధికంగా 237 దాడులు జరిగాయి. అంతర్జాతీయ సహకారం, నిఘాతో పైరేట్ల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది నాలుగు దాడులు జరిగినట్లు సమాచారం. తిరిగి ఈ ఏడాదిలో మళ్లీ దాడుల పరంపర మొదలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
The post India: 270 మంది మయన్మార్ స్కామ్ సెంటర్ బాధితులకు విముక్తి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
India: 270 మంది మయన్మార్ స్కామ్ సెంటర్ బాధితులకు విముక్తి
Categories: