India : పాక్‌తో ఘర్షణ వేళ అఫ్గానిస్థాన్‌తో భారత్ సంబంధాలను పునరుద్ధరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారత రాయబార కార్యాలయం మళ్లీ తెరుస్తామని ఈ సందర్భంగా జైశంకర్ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయని ఇరుదేశ విదేశాంగ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన జైశంకర్.. సీమాంతర ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
India- Afghanistan Ambassy
భారతదేశ భద్రతా సమస్యల పట్ల ఆఫ్ఘనిస్థాన్ చూపిస్తున్న సున్నితత్వాన్ని, సంఘీభావాన్ని భారత్ అభినందిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇక, ఆఫ్ఘనిస్థాన్ ఎక్సలెన్సీ, వృద్ధి, శ్రేయస్సు పట్ల తమ దేశానికి నిబద్ధత ఉందని జైశంకర్ తెలిపారు. అయితే, రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదపు ఉమ్మడి ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అలాగే, ఆఫ్ఘనిస్తాన్ స్థిరత్వానికి భారతదేశం దీర్ఘకాలంగా మద్దతు ఇస్తుందని జైశంకర్ హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతో పాటు ఆ దేశ స్వాతంత్య్రానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం.. జాతీయ అభివృద్ధికి, అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని జైశంకర్ తెలిపారు.
India – కాబూల్ మీద వరుస వైమానిక దాడులు
ఇలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) రాజధాని కాబూల్ రాత్రి బాంబులతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. మృతుల సంఖ్య ఇంకా వెల్లడించలేదు. ఈ వైమానిక దాడులు ఎవరు చేశారనే దానిపైనా స్పష్టత లేదు. గుర్తు తెలియని విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగినట్టు సమాచారం. భారత్ తో ఆర్థిక సంబంధాలను పెంచుకునే లక్ష్యంతో చర్చల కోసం ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి చేరుకున్న సమయంలో కాబూల్‌లో పేలుళ్లు సంభవించిడం విశేషం. 2021లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత, తాలిబన్ నాయకుడు భారతదేశానికి చేసిన మొదటి పర్యటన ఇది.
ఇటీవల పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ వేళ.. అఫ్గాన్ మనకు అనుకూలంగా మాట్లాడింది. పాక్ చేసిన ఆరోపణలను ఖండించింది కూడా. ఇవన్నీ దాయాదిని కలవరపెడుతున్నాయి. ఇదిలాఉంటే, భారత్ లో ముత్తాఖీ తొలి పర్యటన వేళ.. కాబూల్‌లో పేలుళ్లు సంభవించడం కలకలం సృష్టించింది. అది పాక్ కుట్రేనని వార్తలు వస్తున్నాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు పాకిస్థాన్ రక్షణ వ్యవహారాలను విశ్లేషించే పలు సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ మరణించి ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడులకు ముందు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రి వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అఫ్గాన్ ప్రజలను పాక్‌కు శత్రువులుగా అభివర్ణించారు. అఫ్గాన్లు గతంలో.. ప్రస్తుతం భారత్‌కు విధేయులుగా ఉంటున్నారని.. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అక్కసు వెళ్లగక్కారు.
Also Read : Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా
The post India – Afghanistan: కాబుల్ లో భారత రాయబార కార్యాలయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
India – Afghanistan: కాబుల్ లో భారత రాయబార కార్యాలయం
Categories: