బిహార్ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. నాలుగు చోట్ల ఆర్జేడీని కాంగ్రెస్ ఢీకొంటోంది. మరో నాలుగు చోట్ల సీపీఐకి పోటీగా అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపింది. రెండుచోట్ల ఆర్జేడీతో వీఐపీ తలపడుతోంది. తొలివిడత పోలింగు జరగనున్న 121 స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో కూటమి పార్టీలు తమలో తాము పోటీపడతాయా, సయోధ్య కుదుర్చుకుని ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ పరిస్థితి
కహల్గావ్, లాల్‌గంజ్, వార్సలిగంజ్, వైశాలీ స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు తలపడుతున్నారు. బచ్వారా, రాజపకడ్రా, బిహార్ షరీఫ్, సమస్థిపుర్‌లోని రోసెరా స్థానాల్లో సీపీఐ-కాంగ్రెస్ తలపడుతున్నాయి. వీఐపీ పార్టీ అధినేత ముఖేష్ సాహ్ని తన తమ్ముడు సంతోష్ సాహ్నిని దర్భంగా జిల్లా గౌడ బౌరం స్థానంలో బరిలోకి దింపారు. ఆర్జేడీ ఇక్కడి నుంచి బరిలో దూకింది. తారాపుర్‌లోనూ ఈ రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి. సయోధ్య కుదుర్చుకుని 2024 లోక్‌సభ ఎన్నికల తరహాలో ఐక్యతను చాటుకుంటాయా? స్నేహపూర్వక పోటీ అనే ముసుగును తొడిగి వదిలేస్తాయా? అనేది వేచిచూడాలి. అధికార ఎన్‌డీయే కూటమి సీట్ల సర్దుబాటులో విజయం సాధించినా ఆరు పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఇబ్బందులు వెంటాడుతుండటంతో సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. తొలివిడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం గమనార్హం.
130 సీట్లలో ఆర్జేడీ పోటీ
ఇండియా కూటమికి పెద్దదిక్కు ఆర్జేడీ పార్టీ. అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా, నేరుగా వారితో నామినేషన్లు వేయించింది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇది నిదర్శనం. రెండో విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లోనూ వీలైనన్ని ఎక్కువచోట్ల అభ్యర్థులను ఆర్జేడీ బరిలోకి దింపనుంది. ఆర్జేడీనేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల్లో ఒంటరి పోరుకు ఝార్ఖండ్ ముక్తి మోర్చా సిద్ధపడింది.
టికెట్ ఇవ్వలేదని విలపించిన ఆర్జేడీ నేత
పార్టీ టికెట్ ఇవ్వలేదని మదన్ సహ్ అనే అభ్యర్థి ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ ఇంటి బయట ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ‘‘చాలా కాలంగా పార్టీలో ఉన్నాను. మధుబన్ నుంచి పోటీ చేయాలనుకున్నాను. టికెట్ కోసం రూ.2.70 కోట్లు అడిగారు. పిల్లల వివాహాలు వాయిదా వేసి డబ్బు సమకూర్చాను. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. కనీసం డబ్బైనా తిరిగి ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ఆయన విలపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
The post India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?
Categories: